తెలంగాణ

telangana

మోదీకి బంగ్లా యూనస్​ఖాన్​ ఫోన్​ కాల్​- హిందువులకు రక్షణ కల్పిస్తామని హామీ - PM Modi Muhammad Yunus

By ETV Bharat Telugu Team

Published : Aug 16, 2024, 4:54 PM IST

Updated : Aug 16, 2024, 7:22 PM IST

PM Modi Muhammad Yunus : హిందువులతోపాటు ఇతర మైనారిటీలకు రక్షణ కల్పిస్తామని బంగ్లాదశ్ తాత్కాలిక ప్రభుత్వ ముఖ్య సలహాదారు మహమ్మద్​ యూనస్‌ ఖాన్‌ ప్రధాని నరేంద్ర మోదీకి హామీ ఇచ్చారు. ఈ మేరకు తనతో యూనస్‌ఖాన్‌ ఫోన్​లో మాట్లాడినట్లు మోదీ ట్వీట్ చేశారు.

Etv Bharat
Etv Bharat (Etv Bharat)

PM Modi Muhammad Yunus :బంగ్లాదేశ్‌లోని హిందువులు, ఇతర మైనారిటీలకు రక్షణ కల్పిస్తామని ఆ దేశ తాత్కాలిక ప్రభుత్వ ముఖ్య సలహాదారు మహమ్మద్​ యూనస్‌ఖాన్‌ ప్రధాని నరేంద్ర మోదీకి హామీ ఇచ్చారు. ప్రొఫెసర్‌ యూనస్‌ ఖాన్‌ తనకు ఫోన్‌ చేసి మాట్లాడినట్లు మోదీ శుక్రవారం ఎక్స్‌లో పోస్టు చేశారు. ప్రజాస్వామ్య, సుస్థిర, శాంతియుత, ప్రగతిశీల బంగ్లాదేశ్‌ కోసం భారత దేశ మద్దతు కొనసాగుతుందని యూనస్‌కు స్పష్టం చేసినట్లు మోదీ ట్వీట్​లో తెలిపారు.

స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా చేసిన ప్రసంగంలో బంగ్లాదేశ్‌లో మైనారిటీల పరిస్థితిని మోదీ ప్రస్తావించారు. హింస నెలకొన్న బంగ్లాదేశ్‌లో జనజీవనం త్వరలోనే సాధారణ స్థితికి వస్తుందని ఆకాంక్షించారు. పొరుగుదేశంలో ఉన్న హిందువులు ఇతర మైనారిటీలు దాడులకు గురవడంపై 140 కోట్ల మంది భారతీయులు ఆందోళన చెందుతున్నట్లు చెప్పారు. అక్కడ ఉన్న మైనార్టీలు, హిందువుల సురక్షితను భారత్‌ కోరుకుంటోందని తెలిపారు. ఈ నేపథ్యంలోనే యూనస్‌ఖాన్‌ ప్రధాని మోదీకి ఫోన్‌ చేసి ప్రస్తుత పరిస్థితిని వివరించినట్లు తెలుస్తోంది.

బంగ్లాదేశ్‌లో పరిస్థితి అదుపులోకి వచ్చిందని యూనస్ ఖాన్ మోదీకి తెలిపారు. జనజీవనం సాధారణ స్థితికి చేరుకుందని చెప్పారు. శనివారం వర్చువల్​గా జరగనున్న వాయిస్ ఆఫ్ గ్లోబల్ సౌత్ సమ్మిట్‌లో పాల్గొనాలన్న మోదీ ఆహ్వానానికి యూనస్ అంగీకరించారు.

యూనస్‌ ఖాన్​ ఇటీవల మైనారిటీలు, హిందువులపై జరుగుతున్న దాడులపై ఓ కార్యక్రమంలో స్పందించారు. హక్కులు అందరికీ సమానమని, మానవులంతా ఒకటేనని తెలిపారు. మతమేదైనా ప్రజాస్వామ్యంలో అందరం మనుషులమేనని అన్నారు. ఇప్పుడు మోదీకి ఫోన్​​ చేసి హిందువులు, ఇతర మైనారిటీల రక్షణ విషయంపై హామీ ఇచ్చారు.

మరో నలుగురు సలహాదారులు నియామకం
మరోవైపు, ఆపద్ధర్మ ప్రభుత్వంలో మరో నలుగురు సలహాదారులను యూనస్‌ఖాన్‌ నియమించారు. ఆర్థిక, సైనిక, రాజకీయ రంగాల నిపుణులను తమ బృందంలో చేర్చుకున్నారు. ఫలితంగా తాత్కాలిక ప్రభుత్వంలో సలహాదారుల సంఖ్య 21కి చేరింది.

బంగ్లాదేశ్‌లో రిజర్వేషన్ల అంశంపై తలెత్తిన నిరసనలు హింసాత్మకంగా మారడం వల్ల అధికార ప్రభుత్వం కూలిపోయింది. దీంతో ప్రధాని షేక్‌ హసీనా రాజీనామా చేసి దేశాన్ని వీడారు. ప్రస్తుతం భారత్‌లో ఆశ్రయం పొందుతున్నారు. ఈ నేపథ్యంలో యూనస్‌ ఖాన్​ నేతృత్వంలో తాత్కాలిక ప్రభుత్వం ఏర్పడింది.

'అవామీ లీగ్ నేతలపై జరిగినవి ఉగ్రదాడులు- నాకు న్యాయం కావాలి'- షేక్​ హసీనా డిమాండ్ - Sheikh Hasina Bangladesh

బంగ్లాలో బిక్కుబిక్కుమంటూ హిందువులు! మైనార్టీలపై దాడులకు కారణం అదేనా? - Attacks On Bangladesh Hindus

Last Updated : Aug 16, 2024, 7:22 PM IST

ABOUT THE AUTHOR

...view details