Israel Declares New Phase Of War Against Lebanon : లెబనాన్‌లో మరోసారి అనూహ్య దాడులు చోటుచేసుకున్నాయి. వేలాది పేజర్లు పేలిన ఘటన నుంచి తేరుకోకముందే, తాజాగా వాకీటాకీలు పేలాయి. ఈ తరుణంలోనే యుద్ధంలో 'కొత్త దశ' ప్రారంభమైందని స్వయంగా ఇజ్రాయెల్ రక్షణ శాఖ మంత్రి ప్రకటించినట్లు సమాచారం.
నిన్న పేజర్లు - ఇవాళ వాకీటాకీలు
లెబనాన్‌లో మరోసారి అనూహ్య దాడులు చోటుచేసుకున్నాయి. వేలాది పేజర్లు పేలిపోయిన ఘటన నుంచి తేరుకోకముందే, తాజాగా వాకీటాకీలు పేలినట్లు సమాచారం. పేజర్ల పేలుళ్ల ఘటనలో మృతి చెందిన హెజ్‌బొల్లా సభ్యులు, ఓ చిన్నారి అంత్యక్రియలు నిర్వహిస్తున్న సమయంలోనే లెబనాన్ రాజధాని బీరూట్‌లో ఈ వాకీటాకీల పేలుళ్లు చోటుచేసుకోవడం గమనార్హం.
దేశంలోని పలు ప్రాంతాల్లో ఎలక్ట్రానిక్ పరికరాలు పేలాయని, ఈ ఘటనల్లో 9 మంది మృతి చెందారని, 300 మందికిపైగా గాయపడ్డారని లెబనాన్ ఆరోగ్యశాఖ వెల్లడించింది. మరోవైపు, బీరూట్‌లోని అనేక ప్రాంతాల్లో గృహావసరాలకు వినియోగించే సౌరశక్తి వ్యవస్థలు పేలినట్లు అధికారిక మీడియా తెలిపింది. లెబనాన్‌లోని పలు ప్రాంతాల్లో పేలుళ్లు సంభవించాయని హెజ్‌బొల్లా సైతం ప్రకటించింది. వాకీటాకీలు పేలిపోవడం వల్లే ఈ ఘటనలు చోటుచేసుకున్నాయని పేర్కొంది.
లెబనాన్, సిరియాల్లో మంగళవారం ఒకేసారి వందలాది సంఖ్యలో పేజర్లు పేలిన ఘటన ప్రపంచవ్యాప్తంగా ఆందోళనకు గురిచేసిన విషయం తెలిసిందే. ఆ ఘటనలో 12 మంది మృతి చెందగా, 2,800 మంది గాయపడ్డారు. గాయపడిన వారిలో లెబనాన్‌లోని ఇరాన్ రాయబారితోపాటు హెజ్‌బొల్లా కీలక నేతలు కూడా ఉన్నారు. ఈ అనూహ్య దాడి వెనుక ఇజ్రాయెల్ హస్తముందనే ఆరోపణలు ఉన్నాయి. ఇలాంటి సమయంలోనే, యుద్ధంలో కొత్త దశ ప్రారంభమైందని ఇజ్రాయెల్ రక్షణశాఖ మంత్రి స్వయంగా ప్రకటించడం గమనార్హం.
ఆ పేజర్లను మేం తయారు చేయలేదు: గోల్డ్ అపోలో
లెబనాన్‌లో పేలుళ్లకు కారణమైన హెజ్‌బొల్లా పేజర్లను తాము తయారు చేయలేదని గోల్డ్ అపోలో కంపెనీ వెల్లడించింది. ఆ పేజర్లు బుడాపెస్ట్‌లోని ఓ కంపెనీలో తయారయ్యాయని తెలిపింది. వాటిపై తమ కంపెనీ పేర్లు వాడటానికి మాత్రమే అనుమతి ఇచ్చామని ఆ ప్రకటనలో చెప్పింది.
"మా కార్పొరేట్ ఒప్పందం ప్రకారం, బీఏసీ కంపెనీ ఉత్పత్తులను కొన్ని ప్రాంతాల్లో విక్రయానికి కేవలం మా ట్రేడ్ మార్క్‌ను వినియోగించుకోవడానికి అనుమతించాం. ఆ పేజర్ల డిజైన్, తయారీకి పూర్తిగా బీఏసీదే బాధ్యత" అని గోల్డ్ అపోలో వెల్లడించింది.
కంపెనీ ఛైర్మన్ చింగ్ కుంగ్ మాట్లాడుతూ, గత మూడేళ్ల నుంచి బీఏసీతో లైసెన్సింగ్ ఒప్పందం చేసుకొన్నట్లు చెప్పారు. కానీ, సదరు కాంట్రాక్టుకు సంబంధించిన ఎటువంటి ఆధారాలను సమర్పించలేదు. మరోవైపు ఏఆర్ 924 పేజర్లు చాలా కఠినంగా ఉంటాయంటూ ఆ సంస్థ వెబ్‌సైట్‌లో నిన్నటి వరకు ఓ వాణిజ్య ప్రకటన ఉండేది. కానీ, దానిని తాజాగా తొలగించారు.