How Lebanon Pager Explosion Happened : స్థానిక కాలమానం ప్రకారం, మంగళవారం మధ్యాహ్నం 3.30 గంటలు సమయం కావస్తోంది. లెబనాన్‌లోని ఒక మార్కెట్లో ఓ వ్యక్తి షాగింగ్ చేస్తున్నాడు. అకస్మాత్తుగా అతడి వద్ద ఉన్న పేజర్ భారీ శబ్దంతో పేలింది. ఒక్కసారిగా కిందపడి ఆర్తనాదాలు చేశాడు. ఇక్కడే కాదు, లెబనాన్, సిరియావ్యాప్తంగా వందల పేజర్లు ఒకేసారి పేలాయి. ఏం జరిగిందో తెలుసుకునేలోపే తీవ్ర గాయాలతో రక్తపు మడుగుల్లో బాధితులు! ఈ ఘటన ప్రపంచాన్ని ఒక్కసారిగా ఉలిక్కిపాటుకు గురిచేసింది. దీంతో ఇంత కచ్చితత్వంలో ఇలాంటి కోఆర్డినేటెడ్ అటాక్ ఎలా సాధ్యం అయింది? ఎవరు చేశారు? ఈ ఆపరేషన్ చేసేందుకు ఎన్నేళ్ల సమయం పట్టింది? అనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి.
పేజర్లనే ఎందుకు టార్గెట్ చేశారు?
సాధారణంగా పేజర్లను వాడితే ఇజ్రాయెల్‌కు దొరక్కుండా ఉండొచ్చని హెజ్‌బొల్లా వ్యూహకర్తల ప్లాన్. అందులో భాగంగా సెల్ఫోన్లను ఉపయోగించవద్దని హెజ్‌బొల్లా నాయకుడు హసన్ నస్రల్లా గ్రూప్ సభ్యులకు ఆదేశాలు జారీ చేశారు. దీంతో అప్పటినుంచి వారందరూ పేజర్లను ఉపయోగిస్తున్నారు. అయితే, తాజాగా పేలిన పేజర్లు ఇంతకుముందు ఉపయోగించినవి కావని, కొత్త బ్రాండ్‌కు చెందినవని ఓ స్థానిక అధికారి తెలిపారు.
సాధారణంగా సెల్ఫోన్ల ద్వారా జరిగే కమ్యూనికేషన్లను సులభంగా ఇంటర్సెప్ట్ చేయవచ్చని, అలా జరగకుండా సింపుల్ టెక్నాలజీతో రూపొందించిన పేజర్లను వాడతారని న్యూయార్క్ యూనివర్సిటీలో బోధించే నిలోలస్ రీస్ తెలిపారు. ఈ దాడి వల్ల హెజ్‌బొల్లా, తమ కమ్యూనికేషన్ వ్యూహాలను మర్చే అవకాశం ఉందని అభిప్రాయపడ్డారు. ఈ పేలుళ్ల తర్వాత బాధితులు వారి పేజర్లతో పాటు సెల్ఫోన్లకు కూడా పక్కకు విసిరేశారని, ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలను దూరంగా ఉంచారని తెలిపారు.
పేజర్లతో ఎలా విధ్వంసం సృష్టించారు?
ప్రస్తుతం ఉన్న సమాచారం ప్రకారం, పేజర్ల సరఫరా వ్యవస్థలో జోక్యం చేసుకోవడమే ఈ విధ్వంసానికి కారణంగా నిపుణులు అభిప్రాయపడుతున్నారు. పేజర్లను హెజ్బొల్లాకు డెలివరీ చేయడానికి ముందు, చిన్నపాటి పేలుడు పదార్థాలను అందులో అమర్చి ఉండవచ్చని, ఆపై రేడియో సిగ్నల్స్ ద్వారా రిమోట్ లొకేషన్ నుంచి ఏకకాలంలో పేలుడు జరిగేలా చేసినట్లు చెబుతున్నారు.
అయితే అటాక్ జరిగే సమయానికి పేజర్లో ఉన్న బ్యాటరీ, సగం పేలుడు పదార్థం, సగం బ్యాటరీ అయి ఉండవచ్చు అని ట్రస్టెడ్‌సెక్‌లోని సెక్యూరిటీ ఇంటెలిజెన్స్ డైరెక్టర్ కార్లోస్ పెరెజ్ చెప్పారు. ఒక పేలుడు పరికరంలో కంటైనర్, బ్యాటరీ, ట్రిగ్గరింగ్ పరికరం, డిటోనేటర్, పేలుడు ఛార్జ్ వంటి ఐదు పేలుడు పరికరాలు ఉంటాయని బ్రిటీష్ మాజీ బాంబ్ డిస్పోజల్ అధికారి వివరించారు. కాగా, ఈ ఐదింట్లో మూడు పరికరాలు ఇప్పటికే పేజర్లలో ఇన్‌బిల్ట్‌గా ఉన్నాయని, దానికి అదనంగా డిటోనేటర్, ఛార్జ్ మాత్రమే జోడించాల్సి ఉంటుందని పేరు చెప్పడానికి ఇష్టపడని ఓ నిపుణుడు తెలిపారు.
లెబనీస్ మార్కెట్లో మంగళవారం పేజర్ పేలుడు ఘటన జరిగింది. ఈ ఘటనలో ఓ వ్యక్తి తుంటి భాగానికి తీవ్ర గాయం అయింది. దీనికి సంబంధించి వైరల్ అయిన వీడియోను పరిశీలించిన నిపుణులు, ఒక చిన్న పేలుడు పరికరం ద్వారా ఘటన జరిగినట్లు కనిపిస్తోందన్నారు. అయితే ఈ పరిమాణంలో, ఇంత కచ్చితత్వంతో దాడి జరగడం వెనుక, ఒక దేశం హస్తం ఉన్నట్లు కనిపిస్తోందని ఆస్ట్రేలియాకు చెందిన ఆర్మమెంట్ రీసెర్చ్ సర్వీసెస్ డైరెక్టర్, సైనిక అయుధాల నిపుణుడు ఎన్ఆర్ జెన్జెన్ జోన్స్ అన్నారు. ఇలాంటి ఘటనపై గతేడాది ఇజ్రాయెల్‌పై ఇరాన్ ఆరోపణలు చేసింది. తన బాలిస్టిక్ క్షిపణి ప్రయోగంలో, పనిచేయని ఫాల్టీ విదేశీ పరికరాల ద్వారా విధ్వంసం సృష్టించడానికి ఇజ్రాయెల్ ప్రయత్నించిందని ఆరోపించింది. ఇలా ఫాల్డీ పరికరాలు ఉపయోగిస్తే ఆ క్షిపణులు ఉపయోగించకముందే పేలడం లేదా ఆయుధాన్ని దెబ్బతీసే అవకాశం ఉంటుంది.
ఆపరేషన్ ఎంత కాలం జరిగింది?
ఈ స్థాయి దాడి ప్లాన్ చేయడానికి చాలా సమయం పడుతుంది. కచ్చితమైన సమయం తెలియనప్పటికీ, కొన్ని నెలల నుంచి రెండేళ్ల వరకు మధ్య సమయం పట్టి ఉండొచ్చని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఇంత పక్కాగా చేసినవారు చాలా కాలంగా నిఘా సమాచారాన్ని సేకరిస్తున్నారని చెప్పారు. ఇలాంటి దాడి చేయాలంటే, పేజర్లను అమ్మే ముందు భౌతికంగ వాటిని యాక్సెస్ చేయడానికి సంబంధిత వ్యక్తులు, సంస్థలతో సత్సంబంధాలు ఏర్పరచుకోవడం అసరమని చెప్పారు. అలాగే పేజర్లలో అమర్చేందుకు సాంకేతికతను అభివృద్ధి చేయడం, టార్గెట్లు(అంతం చేయాలనుకున్న వక్తులు) పేజర్లను తమ వెంట తీసుకెళ్తున్నాయని నిర్ధరణకు రావడానికి సోర్స్‌లను(ఇన్ఫార్మర్లు) పెంపొందించుకోవడం అసరమని అన్నారు.
దాడి ముందు వరకు అంతా నార్మల్!
దాడికి ముందు కొంత సమయం వరకు పేజర్లు, వాటి వినియోగదార్లకు సాధారణంగానే కనిపించి ఉండవచ్చని నిపుణులు అంటున్నారు. మంగళవారం దాడికి కారణమైన పేజర్లు ఆరు నెలల క్రితమే కొనుగోలు చేసినట్లు బ్రస్సెల్స్కు చెందిన సీనియర్ పొలిటికల్ రిస్క్ అనలిస్ట్ ఎలిజా జే మాగ్నియర్ తెలిపారు. ఈ మేరకు తాను దాడికి గురైన బాధితులను, హెజ్‌బొల్లా సభ్యులతో మాట్లాడినట్లు వెల్లడించారు. పేజర్లు ఆరు నెలల పాటు బాగానే పనిచేశాయన్న మాగ్నియర్, అన్ని పరికరాలకు పంపించిన ఎర్రర్ మెసేజ్ కారణంగా పేలుడు జరిగినట్లు కనిపిస్తోందన్నారు. దాడి తర్వాత చాలా పేజర్లు ఆఫ్ కాలేదని, అనంతరం హెజ్‌బొల్లా సభ్యులు వాటిని తనిఖీ చేశారని చెప్పారు. పేజర్లో లేదా పేజర్ సర్క్యుట్రీలో 3 నుంచి 5 గ్రాముల వరకు హైలీ ఎక్స్‌ప్లోసివ్ పదార్థం ఉన్నట్లు వారు నిర్ధరణకు వచ్చారని మాగ్నియర్ తెలిపారు.
'ఆ పేజర్లు మేం తయారు చేయలేదు'
ఈ దాడికి ఉపయోగించిన పేజర్లను తైవాన్‌కు చెందిన గోల్డ్ అపోలో కంపెనీ తయారు చేసిందని మొదట వార్తలు వచ్చాయి. ఆ వార్తలను గోల్డ్ అపోలో తోసిపుచ్చింది. నిజానికి వాటిని తరయారు చేసింది హంగరీ రాజధాని బుడాపెస్ట్‌కు చెందిన BAC కన్సల్టింగ్ KFT కంపెనీ అని చెప్పింది. ఈ మేరకు గోల్డ్ అపోలో బుధవారం ఒక ప్రకటన విడుదల చేసింది. కాగా, మంగళవారం లెబనాన్‌లో జరిగిన దాడిలో పేజర్లపై గోల్డ్ అపోలో బ్రాండింగ్ ఉండటం గమనార్హం.