Pakistan Elections 2024 :బలమైన మిలిటరీ మద్దతు ఉన్న మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ రికార్డు స్థాయిలో నాలుగోసారి అధికారంలో వస్తారన్న ప్రచారం మధ్య పాకిస్థాన్‌లో సార్వత్రిక ఎన్నికలు జరిగాయి. కట్టుదిట్టమైన భద్రత మధ్య గురువారం ఉదయం ఎనిమిది గంటలకు మొదలైన పోలింగ్ సాయంత్రం ఐదు గంటలకు ముగిసింది. వివిధ పార్టీలకు చెందిన ముఖ్య నేతలంతా ఉదయమే ఓటు హక్కు వినియోగించుకున్నారు.
పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటేసిన ఇమ్రాన్
ప్రస్తుతం జైలులో ఉన్న పీటీఐ అధినేత, మాజీ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్ పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు వేశారు. అయితే ఆయన సతీమణి బుస్రాబీబీ ఓటు వేయలేకపోయారు. ఆమెకు జైలుశిక్ష పడేనాటికి పోస్టల్ బ్యాలెట్ ప్రక్రియ ముగియటమే అందుకు కారణమని తెలుస్తోంది. పాకిస్థాన్ ముస్లిం లీగ్-నవాజ్ పార్టీ అధినేత నవాజ్ షరీఫ్ తన కుమార్తె మరియమ్ నవాజ్‌తో కలిసి లాహోర్‌లోని ఓ పోలింగ్ బూత్‌లో ఓటు వేశారు.
దేశంలో అనేక నియోజకవర్గాల్లో ఉదయం పోలింగ్ శాతం తక్కువే నమోదైనట్లు ఎన్నికల అధికారులు తెలిపారు. క్రమక్రమంగా పుంజుకున్నట్లు చెప్పారు. చాలా చోట్ల పోలింగ్ సిబ్బంది విధులకు రాకపోవడం వల్ల కొందరు ఓటర్లు పోలింగ్ కేంద్రాల వెలుపలే వేచి ఉన్నట్లు పేర్కొన్నారు. పలు పోలింగ్ కేంద్రాల్లో బ్యాలెట్ పత్రాల కొరత వల్ల ఓటింగ్ ప్రక్రియలో జాప్యం జరిగినట్లు ఓటర్లు ఫిర్యాదు చేశారని వెల్లడించారు. కొన్ని చోట్ల భారీ వర్షాలు పడుతుండడం వల్ల ఓటర్లు పోలింగ్‌కు దూరంగా ఉన్నారన్నారు.