తెలంగాణ

telangana

ETV Bharat / international

పాకిస్థాన్​లో సార్వత్రిక ఎన్నికల పోలింగ్- ఇంటర్నెట్ సేవలు బంద్? - general elections in pakistan

Pakistan Elections 2024 : పాకిస్థాన్​లో సార్వత్రిక ఎన్నికల పోలింగ్ జరుగుతోంది. ఉదయం 8 గంటలకు ప్రారంభమైన పోలింగ్ సాయంత్రం 5 గంటల వరకు జరగనుంది. ఓటింగ్ ముగిసిన వెంటనే కౌంటింగ్ ప్రారంభం కానుంది.

Pakistan Elections 2024
Pakistan Elections 2024

By ETV Bharat Telugu Team

Published : Feb 8, 2024, 9:27 AM IST

Updated : Feb 8, 2024, 11:50 AM IST

Pakistan Elections 2024 :ఉగ్రవాదం, హింస, ఆర్థిక సంక్షోభంతో కొట్టుమిట్టాడుతున్న పాకిస్థాన్​లో సార్వత్రిక ఎన్నికల పోలింగ్ జరుగుతోంది. ఉదయం 8 గంటలకు ప్రారంభమైన పోలింగ్ సాయంత్రం 5 గంటల వరకు సాగనుంది. ఓటింగ్ ముగిసిన వెంటనే కౌంటింగ్ ప్రారంభం కానుంది. ఇక దేశంలోని 12కోట్లకుపైగా మంది ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకోవడానికి వీలుగా అధికారిక సెలవు ప్రకటించింది ప్రభుత్వం. భద్రత కోసం 6.50 లక్షల మంది సిబ్బందిని రంగంలోకి దించింది.

పాకిస్థాన్​లో ఎన్నికలు

మరోవైపు, ఉగ్రదాడుల ముప్పు పొంచి ఉన్న నేపథ్యంలో దేశవ్యాప్తంగా మొబైల్‌ ఇంటర్నెట్‌ సర్వీసులను నిలిపివేస్తున్నట్లు హోంశాఖ అధికార ప్రతినిధి ఓ ప్రకటనలో వెల్లడించారు. అయితే, పాకిస్థాన్‌ టెలికమ్యూనికేషన్‌ అథారిటీ మాత్రం దీన్ని తోసిపుచ్చింది. ఆంక్షలు విధించాలని ప్రభుత్వం నుంచి తమకు ఎలాంటి ఆదేశాలు రాలేదని పేర్కొంది. ఈ సేవలు యథాతథంగా కొనసాగుతున్నాయని తెలిపింది. కానీ, కొన్ని ప్రాంతాల్లో మాత్రం ఇంటర్నెట్‌ సర్వీసుల్లో అంతరాయం ఏర్పడినట్లు తెలుస్తోంది.

పాకిస్థాన్​లో ఎన్నికలు

రెండు పార్టీల మధ్యే పోటీ
నవాజ్ షరీఫ్ నేతృత్వంలోని పాకిస్థాన్ ముస్లీం లీగ్, బిలావల్ భుట్టో నాయకత్వంలోని పాకిస్థాన్ పీపుల్స్ పార్టీ, ఇమ్రాన్ ఖాన్ సారథ్యంలోని పాకిస్థాన్ తెహ్రీకే ఇన్సాఫ్‌ పార్టీల మధ్యే ప్రధాన పోటీ నెలకొంది. అవినీతి కేసుల్లో ఇమ్రాన్‌ ఖాన్ జైలులో ఉండటం, పీటీఐ పార్టీ బ్యాటు గుర్తుపై సుప్రీంకోర్టు నిషేధం విధించడం వల్ల షరీఫ్‌కు చెందిన PMLN అతిపెద్ద పార్టీగా అవతరించే అవకాశం ఉంది.

పాకిస్థాన్​లో ఎన్నికలు

గెలిచిన వారికి సవాళ్ల స్వాగతం
పాకిస్థాన్ జాతీయ అసెంబ్లీ(పార్లమెంట్)లో మొత్తం 366 స్థానాలు ఉండగా 266 సీట్లకు ప్రత్యక్ష ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ స్థానాల కోసం మొత్తం 5,121 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. అదే సమయంలో నాలుగు రాష్ట్రాల అసెంబ్లీలకు సైతం గురువారమే ఎన్నికలు జరుగుతున్నాయి. ఆయా రాష్ట్రాల్లో 749 స్థానాలు ఉండగా 593 అసెంబ్లీ సీట్లకు ఎన్నికలు నిర్వహిస్తున్నారు. వీటికి 12,695 మంది పోటీ చేస్తున్నారు.

పాకిస్థాన్​లో ఎన్నికలు

ఎన్నికల్లో గెలిచిన పార్టీకి అనేక సవాళ్లు స్వాగతం పలకనున్నాయి. సంక్షోభంలో ఉన్న పాక్ ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టాల్సిన అవసరం ఉంటుంది. రోజురోజుకూ క్షీణిస్తున్న శాంతిభద్రతల సమస్యను పరిష్కరించాల్సి ఉంటుంది. అంతకుముందు బుధవారం వరుస బాంబు పేలుళ్లతో దద్దరిల్లింది పాకిస్థాన్​. బలూచిస్థాన్‌లో రెండు వేర్వేరు పేలుళ్లలో 30 మంది మృతి చెందారు. 52 మందికి పైగా గాయాలపాలయ్యారు. ప్రజలను పోలింగ్ స్టేషన్‌లకు వెళ్లకుండా నిరోధించేందుకు ఉగ్రవాదులు ఎన్నికల అభ్యర్థులను లక్ష్యంగా చేసుకుంటున్నారని సీనియర్ పోలీసు అధికారి అబ్దుల్లా జెహ్రీ తెలిపారు.

Last Updated : Feb 8, 2024, 11:50 AM IST

ABOUT THE AUTHOR

...view details