Pakistan Election Results : పాకిస్థాన్ సార్వత్రిక ఎన్నికల తుది ఫలితాలను ఆ దేశ ఎన్నికల సంఘం వెల్లడించింది. ఫిబ్రవరి 8న 265 జాతీయ అసెంబ్లీ స్థానాలకు గానూ ఎన్నికలు జరిగాయి. అందులో ఎన్నికల సంఘం 264 స్థానాల ఫలితాలను వెల్లడించింది. వీటిలో పలు కేసుల్లో దోషిగా తేలి జైలులో ఉన్న మాజీ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్‌కు చెందిన తెహ్రీక్ ఎ ఇన్సాఫ్ (PTI) పార్టీ మద్దతుదారులకు అత్యధికంగా 101 స్థానాలు దక్కాయి. ఇమ్రాన్ పార్టీ గుర్తును ఈసీ రద్దు చేయడం వల్ల వీరంతా స్వతంత్ర అభ్యర్థులుగా పోటీ చేసి నెగ్గారు. వీరంతా ఇమ్రాన్‌కే మద్దతు తెలిపారు.
పాకిస్థాన్ జాతీయ అసెంబ్లీలో 336 సీట్లు ఉండగా ఇందులో 266 స్థానాలకు నేరుగా ఎన్నికలు జరుగుతాయి. మిగతా 70 స్థానాలను మైనారిటీలకు, మహిళలకు కేటాయిస్తారు. ఒక అభ్యర్థి మరణించడం వల్ల 265 స్థానాలకు పోలింగ్ జరిగింది. అందులో అత్యధికంగా మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ మద్దుతుదారులకు అత్యధిక స్థానాలు దక్కాయి. ఆ తర్వాత పాకిస్థాన్‌ను 3 పర్యాయాలు ఏలిన మాజీ ప్రధాని నవాజ్‌షరీఫ్‌కు చెందిన పాకిస్థాన్ ముస్లీం లీగ్ నవాజ్ పార్టీకి ఓటర్లు 75 స్థానాలను కట్టబెట్టారు. ఫలితంగా పార్లమెంట్లో సాంకేతికంగా అతిపెద్ద పార్టీగా పాకిస్థాన్ ముస్లీం లీగ్ నవాజ్ అవతరించింది. మరో మాజీ ప్రధాని దివంగత బేనజీర్ భుట్టో కుమారుడు బిలావాల్ జర్దారీ భుట్టో నేతృత్వంలోని పాకిస్థాన్ పీపుల్స్ పార్టీ 54 సీట్లు సాధించింది. కరాచీలో విస్తరించిన ఉర్దూ ప్రాబల్యం అధికంగా ఉండే ముత్తాహిదా క్వామీ మూమెంట్ పాకిస్థాన్ పార్టీకి 17, మరో 12 స్థానాల్లో ఇతర చిన్న పార్టీలు విజయం సాధించాయి.
అయితే ప్రభుత్వ ఏర్పాటుకు 133 సీట్లు అవసరం కాగా ఏ పార్టీకి పూర్తి మెజారిటీ రాలేదు. బలూచిస్థాన్‌లోని 3 స్థానాల ఫలితాలను ఇంకా వెల్లడించాల్సి ఉంది. ఫలితాల వెల్లడికి ముందు ప్రక్రియ ఆలస్యంగా జరగడం వల్ల పాకిస్థాన్‌లో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. పలు రాజకీయ పార్టీలు తీవ్ర నిరసనలు తెలియజేశాయి. నవాజ్ షరీఫ్, బిలావాల్ జర్దారీ భుట్టో కలిసి సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని యోచిస్తున్నట్లు సమాచారం. అయితే ఆ రెండు పార్టీలు కలిసినా ప్రభుత్వ ఏర్పాటుకు మరో 6 సీట్లు అవసరం అవుతాయి.