Sri Lanka Parliament Election : ద్వీపదేశం శ్రీలంక పార్లమెంట్‌కు గురువారం ఎన్నికలు జరుగుతున్నాయి. ఉదయం 7 గంటలకు ఓటింగ్ మొదలవగా, పోలింగ్ కేంద్రాల వద్ద ప్రజలు తమ ఓటుహక్కును వినియోగించుకుంటున్నారు. శ్రీలంకలో మొత్తం 1.70కోట్లకు పైగా ఓటర్లు ఉన్నారు. 2022లో ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొన్న తర్వాత పార్లమెంట్ ఎన్నికలు కావడం వల్ల ఆసక్తికరంగా మారాయి. మరోవైపు అధ్యక్షుడు అరుణకుమార దిస్సనాయకే నేతృత్వంలోని అధికార 'నేషనల్ పీపుల్స్ పవర్' పార్టీకి ఈ ఎన్నికలు ప్రధాన పరీక్షగా నిలిచాయి. సెప్టెంబరు 21న జరిగిన శ్రీలంక అధ్యక్ష ఎన్నికల్లో 50శాతం ఓట్లు సాధించలేకపోయిన అరుణకుమార ఈసారి ఆధిక్యాన్ని సాధించాలని భావిస్తున్నారు.
ఈ ఎన్నికల్లో ప్రాతినిధ్య ఓట్ల ఆధారంగా ఎంపీలను ఎన్నుకొంటారు. ప్రతి ఓటరు ముగ్గురు అభ్యర్థులకు తమ ప్రాధాన్యాలను కేటాయించవచ్చు. మొత్తం 225 పార్లమెంట్ సీట్లలో 196 స్థానాల ఎంపీలను ఇలానే ఎన్నుకొంటారు. మిగతా 29 సీట్లను నేషనల్ లిస్ట్ సీట్లుగా పిలుస్తారు. వీటిని పార్టీలు, స్వతంత్ర అభ్యర్థుల గ్రూప్‌లకు కేటాయిస్తారు. దేశవ్యాప్తంగా ఆయా పార్టీలు లేదా గ్రూప్‌లకు దక్కిన ఓట్ల శాతం ఆధారంగా వీటిని కేటాయిస్తారు. 196 స్థానాలకు జరుగుతున్న ఎన్నికల్లో 8,821 మంది అభ్యర్థులు పోటీపడుతున్నారు. ఓటింగ్ పూర్తయిన అనంతరం కౌంటింగ్ చేపడతారు. శుక్రవారం ఫలితాలు వెల్లడయ్యే అవకాశం ఉంది.
ఇక అధ్యక్ష ఎన్నికల్లో ఓడిపోయిన విక్రమసింఘె ఈ ఎన్నికల్లో పోటీ చేయడం లేదు. అటు దశాబ్దాలుగా రాజకీయాల్లో ఉన్న రాజపక్సే సోదరులు మహింద, గొటబాయ, చమల్, బసిల్ ఎవరూ కూడా బరిలోకి దిగలేదు.