AP CM Brother Ramamurthy Naidu Died Today : ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడి సోదరుడు నారా రామ్మూర్తినాయుడు కన్నుమూశారు. గురువారం ఆయనకు హార్ట్ అటాక్ రావడంతో ప్రాధమిక చికిత్స అనంతరం హైదరాబాద్ గచ్చిబౌలిలోని ఏఐజీ ఆసుపత్రికి తరలించారు. సోదరుడి మరణవార్త తెలియడంతో మహారాష్ట్ర పర్యటనలో ఉన్న చంద్రబాబునాయుడు హైదరాబాద్ చేరుకున్నారు. ఏపీ మంత్రి నారా లోకేశ్ అంతకుముందే అన్ని కార్యక్రమాలను రద్దు చేసుకొని హుటాహుటిన హైదరాబాద్కు వచ్చారు. ఏఐజీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఇవాళ 12.45 గంటలకు చనిపోయినట్లు ఆసుపత్రి వర్గాలు తెలిపాయి. రామ్మూర్తి నాయుడుకు నివాళులు అర్పించేందుకు బాలకృష్ణ, నందమూరి కుటుంబసభ్యులు, తెలుగుదేశం పార్టీ పెద్దలు ఆసుపత్రికి తరలివచ్చారు.
1952లో జన్మించిన రామ్మూర్తినాయుడు నారా కర్జూరనాయుడు, అమ్మన్నమ్మ దంపతుల రెండో కుమారుడు. తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడుకి తమ్ముడు. రామ్మూర్తి నాయుడికి భార్య ఇందిర, ఇద్దరు కుమారులు ఉన్నారు. వారిలో ఒకరు నటుడు రోహిత్, మరొకరు నారా గిరీష్. 1994లో రామ్మూర్తి నాయుడు చిత్తూరు జిల్లా చంద్రగిరి అసెంబ్లీ నుంచి ఎమ్మెల్యేగా గెలుపొంది 1999 వరకు ప్రజలకు సేవలందించారు. అనంతరం ఆయన అనారోగ్యంతో రాజకీయాల నుంచి విరామం తీసుకున్నారు. రామ్మూర్తి నాయుడు మృతితో నారా కుటుంబంలో విషాద ఛాయలు నెలకొన్నాయి.
ప్రముఖుల నివాళులు : సోదరుని మరణవార్తతో మహారాష్ట్ర పర్యటనను రద్దు చేసుకొని హైదరాబాద్ వచ్చిన చంద్రబాబు నాయుడు ఆసుపత్రిలో సోదరుడి పార్ధివదేహానికి నివాళులు అర్పించారు. తమ్ముడు రామ్మూర్తినాయుడు నన్ను విడిచి వెళ్లిపోయాడని బాధాతప్త హృదయంతో అందరికీ తెలియచేస్తున్నానని అన్నారు. రామ్మూర్తి నాయుడు ప్రజాజీవితంలో పరిపూర్ణ మనసుతో ప్రజలకు సేవలు చేశాడని కొనియాడారు. మా నుంచి దూరమై కుటుంబంలో ఎంతో విషాదం నింపాడని, రామ్మూర్తినాయుడి ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటున్నానని సీఎం చంద్రబాబు అన్నారు.
నా తమ్ముడు, చంద్రగిరి నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే నారా రామ్మూర్తి నాయుడు మనల్ని విడిచి వెళ్లిపోయాడని బాధాతప్త హృదయంతో అందరికి తెలియచేస్తున్నాను. రామ్మూర్తి నాయుడు ప్రజా జీవితంలో పరిపూర్ణ మనసుతో ప్రజలకు సేవలు అందించిన నాయకుడు. మా నుంచి దూరమైన మా సోదరుడు మా కుటుంబంలో ఎంతో విషాదాన్ని… pic.twitter.com/uZElKIo85x
— N Chandrababu Naidu (@ncbn) November 16, 2024
రామ్మూర్తి నాయుడు మరణం రేవంత్ రెడ్డి దిగ్భ్రాంతి : రామ్మూర్తి నాయుడు మృతిపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన పవిత్ర ఆత్మకు శాంతి కలగాలని, వారి కుటుంబ సభ్యులకు మనో ధైర్యాన్ని ప్రసాదించాలని ఆ భగవంతుడిని ప్రార్థించినట్లు ప్రకటన విడుదల చేశారు.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడి గారి సోదరుడు... మాజీ ఎమ్మెల్యే నారా రామ్మూర్తి నాయుడు మృతి దిగ్భ్రాంతికరం.
— Revanth Reddy (@revanth_anumula) November 16, 2024
ఆయన ఆత్మకు శాంతి కలగాలని భగవంతుడిని ప్రార్థిస్తూ… వారి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను.@ncbn
చిన్నాన్న నారా రామ్మూర్తి నాయుడు మృతి తీవ్ర విషాదం నింపిందని మంత్రి నారా లోకేశ్ అన్నారు. చిన్నాన్నతో చిన్ననాటి తన అనుబంధం కళ్ల ముందు కదిలి వచ్చిన కన్నీటితో నివాళులు అర్పిస్తున్నానని పేర్కొన్నారు. మౌనమునిలా మారిన చిన్నాన్న ఇన్నాళ్లూ మాకు కంటికి కనిపించే ధైర్యమని, నేటి నుంచి చిరకాల జ్ఞాపకమన్నారు. చిన్నాన్న ఆత్మకు శాంతి కలగాలని దేవుణ్ని ప్రార్థిస్తున్నానని, అంతులేని దుఃఖంలో ఉన్న తమ్ముళ్లు, పిన్ని దైర్యంగా ఉండాలని కోరుతున్నానని అన్నారు.
చిన్నాన్న నారా రామ్మూర్తి నాయుడు గారి మృతి తీవ్ర విషాదం నింపింది. చిన్నాన్నతో చిననాటి నా అనుబంధం కళ్ల ముందు కదిలి వచ్చిన కన్నీటితో నివాళులు అర్పిస్తున్నాను. మౌనమునిలా మారిన చిన్నాన్న ఇన్నాళ్లూ మాకు కంటికి కనిపించే ధైర్యం..నేటి నుంచి చిరకాల జ్ఞాపకం. చిన్నాన్న ఆత్మకు… pic.twitter.com/5kXf2JkyAa
— Lokesh Nara (@naralokesh) November 16, 2024
నారా రామ్మూర్తినాయుడు ఆత్మకు శాంతి చేకూరాలని ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అన్నారు. సోదర వియోగంతో బాధపడుతున్న చంద్రబాబుకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.