తెలంగాణ

telangana

ETV Bharat / international

సంకీర్ణ ప్రభుత్వానికి జై కొట్టిన సైన్యం- స్వతంత్రుల మద్దతు నవాజ్​కే! ఇంకా తేలని పాక్​ ఫలితం

Pakistan Election Results 2024 : పాకిస్థాన్​ సార్వత్రిక ఎన్నికల ఫలితాల ప్రకటనలో కొనసాగుతున్న జాప్యంపై ఆ దేశ ఆర్మీ చీఫ్ జనరల్​ అసిమ్​ మునీర్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఏకీకృత ప్రభుత్వ ఏర్పాటుకు ప్రజాస్వామ్య శక్తులు సహకరించాలని ఆయన కోరారు. మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్‌కు అనుకూలంగా మునీర్ వ్యవహరిస్తున్నట్టు వస్తున్న వార్తలకు ఆయన చేసిన ఈ వ్యాఖ్యలు మరింత బలాన్ని చేకూరుస్తున్నాయి. మరోవైపు నేషనల్ అసెంబ్లీకి ఎన్నికైన ముగ్గురు ఇండిపెండెంట్​లు నవాజ్​ షరీఫ్ పార్టీలో అధికారికంగా చేరారు.

Pakistan Election Results 2024
Pakistan Election Results 2024

By ETV Bharat Telugu Team

Published : Feb 11, 2024, 8:07 AM IST

Pakistan Election Results 2024 : పాకిస్థాన్‌ సార్వత్రిక ఎన్నికల్లో హంగ్​ ఏర్పడిన నేపథ్యంలో సంకీర్ణ ప్రభుత్వ ఏర్పాటుకే మద్దతు తెలిపింది ఆ దేశ సైన్యం. నూతన ప్రధాని ఎన్నికపై పాక్​ సైన్యాధ్యక్షుడు జనరల్ అసిమ్ మునీర్ పరోక్షంగా కీలక వ్యాఖ్యలు చేశారు. ఏకీకృత ప్రభుత్వ ఏర్పాటుకు ప్రజాస్వామ్య శక్తులు సహకరించాలని కోరారు. మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్‌కు అనుకూలంగా మునీర్ వ్యవహరిస్తున్నట్టు వస్తున్న వార్తలకు ఆయన వ్యాఖ్యలు బలాన్ని చేకూరుస్తున్నాయి. అవినీతి ఆరోపణలతో శిక్షపడి బెయిల్‌పై లండన్ పారిపోయిన షరీఫ్, ఎన్నికల ముందు పాక్‌కు రావడం వెనక సైన్యం హస్తం ఉందని ఆరోపణలున్నాయి.

'అలాంటి చర్చలేమీ జరగలేదు'
మరోవైపు సంకీర్ణ ప్రభుత్వ ఏర్పాటు కోసం బిలావల్ భుట్టో జర్దారీ నేతృత్వంలోని పాకిస్థాన్ పీపుల్స్ పార్టీతో నవాజ్‌ షరీఫ్ సోదరుడు, పూర్వ ప్రధాని షెహబాజ్ షరీఫ్ చర్చలు జరిపినట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగా బిలావల్‌ భుట్టో నేతృత్వంలోని పాకిస్థాన్ పీపుల్స్ పార్టీ(పీపీపీ) పాకిస్థాన్‌ ముస్లిం లీగ్‌(పీఎంఎల్​ఎన్)​ పార్టీలతో సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతున్నాయి అంటూ పెద్ద ఎత్తున ప్రచారం సాగుతోంది. అయితే ఈ వార్తలను బిలావల్‌ భుట్టో ఖండించారు. ఈ విషయంలో తమ పార్టీ అధికారికంగా ఇంకా ఎలాంటి చర్చలు జరపలేదని ఆయన వెల్లడించారు. కాగా, ఇప్పటికే 53 స్థానాల్లో గెలిచిన తాము ఒంటరిగా మాత్రం ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం మాత్రం అసాధ్యమే అని ఆయన స్పష్టం చేశారు.

షరీఫ్​​కు మద్దతు తెలిపిన స్వతంత్రులు
ఇదిలాఉంటే పాకిస్థాన్​ సార్వత్రిక ఎన్నికల ఫలితాల ప్రకటన జాప్యం వేళ నేషనల్ అసెంబ్లీకి కొత్తగా ఎన్నికైన ముగ్గురు స్వతంత్రులు నవాజ్​ షరీఫ్​ పార్టీలో చేరుతున్నట్లు అధికారికంగా ప్రకటించారు. వీరిలో బారిస్టర్ అకీల్, రాజా ఖుర్రం నవాజ్​, మియాన్​ ఖాన్​ బుగ్తీ ఇండిపెండెంట్​లు ఉన్నారు.

ఎన్నికల ఫలితాలు వెల్లడి జాప్యంపై కోర్టుకు?
మరోవైపు పాకిస్థాన్‌లో ఓట్ల లెక్కింపు జాప్యంపై ఇమ్రాన్‌ ఖాన్‌ పార్టీ నేతలు అనుమానాలు వ్యక్తం చేశారు. ఎన్నికల ఫలితాలను ఈసీ తారుమారు చేస్తోందని ఆరోపించారు. ఓట్ల లెక్కింపులో రిగ్గింగ్​, ఆలస్యం వంటి అంశాలపైనా కోర్టును ఆశ్రయించే అవకాశం ఉందని స్థానిక మీడియా వెల్లడించింది. ఇక ఎన్నికల ఫలితాల వెల్లడి విషయంలో ఆలస్యం కారణంగా ఇమ్రాన్‌ పార్టీ తెహ్రీక్‌-ఇ-ఇన్సాఫ్‌-పీటీఐ ఆదివారం దేశవ్యాప్తంగా శాంతియుత నిరసనలు చేపట్టాలని పిలుపునిచ్చింది.

పాక్‌లో 265 జాతీయ అసెంబ్లీ సీట్లకు ఎన్నికలు జరిగితే 257 స్థానాల ఫలితాలనే ఇప్పటివరకు వెల్లడించారు. ఇందులో ఇమ్రాన్ బలపరిచిన స్వతంత్రులు- 92, మాజీ ప్రధాని నవాజ్‌ షరీఫ్‌ సారథ్యంలోని పాకిస్థాన్‌ ముస్లిం లీగ్‌(పీఎంఎల్​ఎన్)​- 73, బిలావల్‌ భుట్టో నేతృత్వంలోని పాకిస్థాన్ పీపుల్స్ పార్టీ- 53 స్థానాల్లో గెలుపొందాయి. మిగిలిన సీట్లు ఇతర పార్టీలు దక్కించుకున్నాయి. ప్రభుత్వ ఏర్పాటుకు 133 సీట్లు కావాల్సి ఉండగా ఎవరికీ స్పష్టమైన ఆధిక్యం లేదు. ఎవరికి వారు తామే అతిపెద్ద పార్టీగా ప్రకటించుకుంటున్నారు. ఇమ్రాన్‌ఖాన్‌ మద్దతుదారులు అత్యధిక స్థానాల్లో గెలిచినప్పటికీ ప్రభుత్వం ఏర్పాటుకు ఇంకా 31 స్థానాలు కావాల్సి ఉంది. మిగిలిన స్థానాల ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది.

పాకిస్థాన్‌లో నవాజ్‌ సంకీర్ణమే- పొత్తుకు భుట్టో పార్టీ ఓకే!

పాక్​ ఎన్నికల వేళ ఇమ్రాన్​కు ఊరట- 12 కేసుల్లో బెయిల్​

ABOUT THE AUTHOR

...view details