India Objects China New Counties In Ladakh : చైనా టిబెట్‌లోని హోటాన్ ప్రిఫెక్చర్‌లో నూతనంగా రెండు కౌంటీలను ఏర్పాటు చేయడంపై భారత్ తీవ్ర నిరసన తెలిపింది. అక్రమంగా, బలవంతంగా భారత్ భూభాగాన్ని ఆక్రమించుకోవడాన్ని సహించబోమని తేల్చిచెప్పింది. రెండు కౌంటీలలోని కొంత భూభాగం లద్ధాఖ్‌లో భాగం కావడం వల్ల దౌత్య మార్గాల ద్వారా నిరసన తెలిపినట్లు విదేశాంగ అధికార ప్రతినిధి రణ్‌ధీర్ జైశ్వాల్ తెలిపారు. లద్ధాఖ్‌లోని భూభాగాన్ని చైనా అక్రమంగా ఆక్రమించడాన్ని భారత్ ఎన్నడూ అంగీకరించలేదని చెప్పారు.
'అది అంగీకరించబోం!'
"ఈ కౌంటీల నిర్మాణం గురించి చైనా చేసిన ప్రకటన చూశాం. ఆ కౌంటీల్లో కొంత భాగం లద్దాఖ్ పరిధిలోకి వస్తుంది. ఈ ప్రాంతంలో భారత భూభాగాన్ని చైనా ఆక్రమించడం ఎన్నడూ అంగీకరించం. ఈ కొత్త కౌంటీల ఏర్పాటు అనేది ఈ ప్రాంతంలో భారత్‌కు దీర్ఘకాలంగా, స్థిరంగా ఉన్న సార్వభౌమాధికారంపై ఎలాంటి ప్రభావం చూపదు. ఇలా చట్టవిరుద్ధమైన, బలవంతపు ఆక్రమణలతో చట్టబద్ధత వాటికి లభించదు" అని రణ్‌ధీర్ జైశ్వాల్ ఘాటుగా స్పందించారు.
'మా ప్రయోజనాల కోసం ఏమైనా చేస్తాం'
టిబెట్‌లో బ్రహ్మపుత్ర నదిపై డ్యామ్ నిర్మించాలన్న చైనా నిర్ణయంపై సమీక్షించామని తెలిపారు. ఈ విషయంలో భారత్ ప్రయోజనాలను కాపాడేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నామని చెప్పిన జైశ్వాల్ దౌత్య మార్గాల ద్వారా భారత్ ఆందోళనలను తెలియజేశామని వెల్లడించారు. బ్రహ్మపుత్ర నదిపై నిర్మిస్తున్న డ్యామ్ వల్ల దిగువనున్న ప్రాంతాలపై ప్రభావం ఉండదని చైనా తన స్పందనను తెలియజేసిందని జైశ్వాల్ తెలిపారు.
టిబెట్‌లో బ్రహ్మపుత్ర నదిని యార్గంగ్ జాంగ్బో అంటారు. దీనిపై 13,700 కోట్ల డాలర్లు ఖర్చుతో భారీ డ్యామ్ నిర్మించాలని చైనా నిర్ణయించింది. హిమాలయాలల్లో టిబెట్ ప్రాంతం నుంచి అరుణాచల్‌ప్రదేశ్‌కు వంపు తిరిగే చోట డ్యామ్ నిర్మించాలని అనుకుంటోంది. అయితే ఇది అరుణాచల్‌తో పాటు అసోం రాష్ట్రాలకు ప్రతికూలంగా మారే అవకాశం ఉంది. ఇరు దేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు తలెత్తితే చైనా ఈ ఆనకట్ట నుంచి ఒక్కసారిగా భారీగా నీళ్లు విడుదల చేస్తే, కింద భూభాగాలను ముంచేస్తుందని భారత్ ఆందోళనలను వ్యక్తం చేస్తోంది.