Pakistan Businessman On Modi : భారత ప్రధానిగా మూడోసారీ నరేంద్ర మోదీయే ఎన్నికవుతారని, అలాంటి బలమైన నాయకుడు ఉండటం యావత్ ప్రంచానికి మంచి చేస్తుందని పాక్-అమెరికన్ వ్యాపారవేత్త సాజిద్ తరార్ అన్నారు. దేశాన్ని ఆయన సరికొత్త శిఖరాలకు తీసుకెళ్లారని కొనియాడారు. పాకిస్థాన్‌లో సమస్యలన్నింటినీ పరిష్కరించగలిగే ఇలాంటి నాయకుడొకరు రావాలని ఆకాంక్షించారు.
'మోదీ అద్భుతమైన నాయకుడు. పుట్టుకతోనే లీడర్. ఆయన నాయకత్వం కేవలం భారత్‌కే కాదు, మొత్తం ప్రపంచానికీ మంచి చేస్తుంది. ప్రతికూల పరిస్థితుల్లోనూ పాకిస్థాన్‌లో పర్యటించి, తన రాజకీయ భవితవ్యాన్ని పణంగా పెట్టిన ఏకైక ప్రధాని. మాకూ అలాంటి నాయకుడు రావాలని ఆశిస్తున్నాం. పాకిస్థాన్‌తో చర్చలు జరిపి వాణిజ్యం ప్రారంభిస్తారని అనుకుంటున్నాం. శాంతియుత వాతావరణం ఇరుదేశాలకూ మంచిది' అని సాజిత్ తరార్ అన్నారు.
సాజిత్ తరార్ 1990లో అమెరికాకు వెళ్లారు. ఇప్పటికీ పాకిస్థాన్ రాజకీయ నాయకులతో సన్నిహిత సంబంధాలు కొనసాగిస్తున్నారు. భారత్‌లో 97 కోట్ల మంది ఓటు హక్కు వినియోగించుకోవడం ఓ అద్భుతమని సాజిత్ తరార్ పేర్కొన్నారు. 'మోదీ ఆదరణ రోజురోజుకీ పెరుగుతోంది. 2024లో భారత పురోగతి అత్యద్భుతం. ఆ దేశ విజయాన్ని అందరూ చెప్పుకొంటారు. భవిష్యత్తులో ప్రతిఒక్కరూ భారత ప్రజాస్వామ్యాన్ని చూసి నేర్చుకుంటారు' అని తరార్ అభిప్రాయపడ్డారు.
పీవోకే నిరసనలకు కారణమిదే
పాకిస్థాన్ తీవ్ర ఆర్థిక సంక్షోభం ఎదుర్కొంటోందని తరార్ గుర్తుచేశారు. ఇది పాక్ ఆక్రమిత కశ్మీర్ సహా దేశవ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో సామాజిక అస్థిరతకు దారితీసిందని పేర్కొన్నారు. విద్యుత్తు బిల్లులు పెరగడమే పీవోకేలో నిరసనలకు ప్రధాన కారణమని వెల్లడించారు. పీవోకేకు ఆర్థిక సాయం అందజేయాలన్న పాక్ ప్రధాని నిర్ణయాన్ని తరార్ ప్రశ్నించారు. డబ్బు ఎక్కడి నుంచి వస్తోందని నిలదీశారు.