Trump On Immigration : అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన ఎన్నికల ప్రచారంలో అక్రమ వలసదారులపై విరుచుకుపడ్డారు. వారిని దేశం నుంచి తరిమేస్తానన్నారు. అందుకు తగినట్లుగానే అధికారంలోకి రాగానే ట్రంప్ ఇమ్మిగ్రేషన్‌కు సంబంధించి 10 ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్‌పై సంతకం చేశారు. చెప్పిన వాగ్ధానాలను అమలు చేసేందుకు అనేక ఆర్డర్లను కూడా జారీ చేశారు. అయితే వాటిల్లో కొన్ని చట్టపరంగా సవాళ్లను ఎదుర్కొంటున్నాయి. మరికొన్ని అమలు అవ్వడానికి సమయం పట్టొచ్చు. ఏది ఏమైనప్పటికీ ట్రంప్ చర్యలతో ప్రస్తుతం ఎప్పుడు ఏమి జరుగుతుందో అని వలసదారులు ఆందోళనలు చెందుతున్నారు.
అక్రమ వలసరాదుల అరెస్ట్‌లు
జనవరి 23 నుంచి 27 వరకు రోజుకు సగటున 710 అరెస్ట్‌లు జరిగినట్లు యూఎస్ ఇమ్మిగ్రేషన్, కస్టమ్స్ ఎన్ఫోర్స్మెంట్(ఐసీఈ) తెలిపింది. జనవరి 26 నుంచి అరెస్ట్‌ల సంఖ్య మరింత పెరిగిందని పేర్కొంది. అదే జో బైడెన్ కాలంలో రోజువారీ అరెస్ట్‌లు 311గా ఉండేది. 2013లో రోజువారీ అరెస్ట్‌లు సగటున 636గా ఉంది. ప్రస్తుతం అక్రమ వలసదారుల్ని గుర్తించేందుకు ప్రత్యేక బృందాలు పనిచేస్తున్నాయి. వలస సేవలు, హోంలాండ్ భద్రత, ఎఫ్‌బీఐ, డ్రగ్ ఎన్ఫోర్స్మెంట్, బ్యూరో ఆఫ్ ఆల్కహాల్, పొగాకు, ఆయుధాలు, పేలుడు పదార్థాల అధికారులు ఈ గాలింపు చర్యల్లో పాల్గొంటున్నారు.
డిపోర్టేషన్
సరైన పత్రాల్లేకుండా దేశంలోకి ప్రవేశించి నివాసముంటున్న వారిని పెద్దఎత్తున స్వదేశాలకు తిప్పి పంపుతున్నారు(డిపోర్టేషన్). ఇందుకోసం సైనిక విమానాల్ని వినియోగిస్తున్నారు. ఇప్పటి వరకు ఎంత మందిని వెనక్కి తిప్పి పంపించారో ఐసీఈ చెప్పలేదు. అదే బైడెన్ కాలంలో 12 నెలల వ్యవధిలోనే 2,70,000 కంటే ఎక్కువ మందిని వెనక్కి పంపినట్లు పేర్కొంది.
చేతులకు బేడీలతో వెనక్కి
అమెరికా నుంచి వచ్చే అక్రమ వలసదారుల విమానాలను అనుమతించేందుకు తొలుత నిరాకరించిన కొలంబియా, ట్రంప్ టారిఫ్ హెచ్చరికలతో దిగొచ్చింది. అమెరికా సైనిక విమానాలను దేశంలోకి ప్రవేశించకుండా నిషేధిస్తామని చెప్పి వాటిని వెనక్కి పంపించారు కొలంబియా అధ్యక్షుడు గుస్తావో. దీంతో కొలంబియా నుంచి తమ దేశానికి దిగుమతయ్యే వస్తువులపై 25 శాతం టారిఫ్ విధిస్తామని ట్రంప్ హెచ్చరించారు. అంతేకాదు ఈ టారిఫ్‌లు మరో వారంలో 50 శాతానికి పెరుగుతాయని పేర్కొన్నారు. దీనితో కొలంబియా వెనక్కి తగ్గింది. ఇక బ్రెజిల్ నుంచి అక్రమంగా వలస వచ్చిన వారిని గొలుసులతో కట్టి చేతులకు బేడీలు వేసి సైనిక విమానం ఎక్కించి మరి వెనక్కి పంపించిట్లు కథనాలు వెలువడ్డాయి. 80 మందితో అమెరికా నుంచి విమానం గ్వాటెమాలాకు వెళ్లింది.
మొబైల్ యాప్‌పై నిషేధం
మెక్సికో సరిహద్దు దాటి రెండళ్ల అనుమతితో అమెరికాలోకి ప్రవేశించడానికి ఉపయోగిస్తున్న సీబీపీ వన్ అనే మొబైల్ యాప్‌ను ట్రంప్ నిషేధించారు. ఇప్పటి వరకు ఆ యాప్ ద్వారా మిలియన్ మంది ప్రజలు అమెరికాలో ప్రవేశించారు. క్యూబా, వెనెజువెలా, హైతీ, నికరాగువా దేశాల నుంచి ఫైనాన్సియల్ స్పాన్సర్స్ సాయంతో ఆన్లైన్లో తాత్కాలిక పని అనుమతులు వచ్చే విధానాన్ని కూడా రద్దు చేశారు.
అక్రమ వలసదారులకు అడ్డుకట్ట వేయడానికి శాండియాగో, ఎల్పాసోల్లో 1,500 మంది సైనికులను అమెరికా మోహరించింది. 1878 చట్టం ప్రకారం పౌర చట్ట అమలులో సైనిక ప్రమేయాన్ని నిషేధిస్తుంది. ఈ నిషేధంపై ట్రంప్ పాజిటివ్ సంకేతాలు ఇచ్చారు. నిర్బంధం, రవాణా వంటి వాటిల్లో సైన్యం సహాయం చేయవచ్చని ట్రంప్ ఆర్డ్ర్లో పేర్కొన్నారు. అంతేకాకుండా పాఠశాలలు, ఆస్పత్రులు, ప్రార్థనా స్థలాల వంటి ప్రదేశాల్లో అరెస్ట్ చేయకూడదనే విధానాన్ని కూడా అమెరికా ప్రభుత్వం తొలగించింది.
ఇంకేమున్నాయి?
అమెరికాలోకి ప్రవేశించే ముందు విదేశాలల్లో తనిఖీ చేసిన శరణార్థులను పునరావాసం కల్పించడాన్ని ట్రంప్ నిలిపివేశారు. ఈ పనిని ట్రంప్ మొదటిసారి అధ్యక్షుడుగా ఉన్నప్పుడే చేశారు. కానీ జో బైడెన్ వచ్చాక తిరిగి ప్రారంభించారు. తాత్కాలిక వసతి, ఉద్యోగ శిక్షణ, ఇతర సహాయాలను అందించే పనులను వెంటనే నిలిపివేయాలని విదేశాంగ శాఖ చెప్పినట్లు సంబంధిత గ్రూపులు తెలిపాయి. ఇమ్మిగ్రేషన్ కోర్టులు, సంక్లిష్ట చట్టాల గురించి చెప్పే కార్యక్రమాలను నిలిపివేయాలని న్యాయశాఖ తెలిపిందని సహాయ బృందాలు పేర్కొన్నాయి. అక్రమ వలసలకు అడ్డుకట్ట వేసేందుకు ఇక ట్రంప్ అధ్యక్షుడైన తొలి రోజునే 1868 రాజ్యాంగ సవరణ ప్రకారం అమెరికాలో జన్మించిన వారికి వచ్చే సహజ పౌరసత్వంపై వేటు వేశారు.
విద్యార్థుల్లో భయం
వివిధ దేశాలకు చెందిన వీసాలపై అమెరికాకు వచ్చి చదువుకుంటున్న విద్యార్థుల్లోనూ భయం నెలకొంది. చదువు కోసం కావాల్సిన డబ్బులు సంపాదించడం కోసం చాలా మంది పార్ట్‌టైం ఉద్యోగాలు చేస్తుంటారు. ప్రభుత్వ యంత్రాంగం తీసుకుంటున్న తాజా చర్యలతో ఇలాంటి విద్యార్థులు హడలిపోతున్నారు. తమను ఎక్కడ లక్ష్యంగా చేసుకుంటారోనని ఆందోళన చెందుతున్నారు.