Israeli Attack On Lebanon :హెజ్బొల్లా-ఇజ్రాయెల్ మధ్య కాల్పుల ఒప్పందం ఉల్లంఘనకు గురైంది. దక్షిణ లెబెనాన్‌లో ఆదివారం ఇజ్రాయెల్ దళాలు జరిపిన కాల్పుల్లో ఆరుగురు మహిళలు సహా 22మంది పౌరులు ప్రాణాలు కోల్పోయారు. 124మందికి పైగా గాయాలపాలయ్యారు. ఈ దాడిలో దాదాపు 20 సరహద్దు గ్రామాలకు చెందిన పౌరులకు గాయాలయ్యాయి.
కాల్పుల విరమణ ఒప్పందం ప్రకారం దక్షిణ లెబెనాన్ నుంచి ఇజ్రాయెల్ సైన్యం వైదొగాలి. కానీ, గడువు దాటినా ఇంకా నెతాన్యాహు తమ దళాలను ఉపసంహరించలేదు. ఈ నేపథ్యంలో వేలాది ప్రజలు తమ గ్రామాలకు, పట్టణాలకు ఆదివారం తిరిగివచ్చారు. ఇదే సమయంలో కొందరు హెజ్బొల్లా జెండాలు పట్టుకొని ఇజ్రాయెల్ దళాలు ఉన్న ప్రాంతాల్లోకి ప్రవేశించడానికి యత్నించగా, ఐడీఎఫ్ కాల్పులు జరిపింది.
ఇజ్రాయెల్ ఇంకా కొన్ని రోజులు లెబనాన్‌లోనే ఉండాలనుకుంటోంది. దక్షిణ లెబనాన్‌లోని కొన్ని ప్రాంతాల్లో హెజ్బొల్లా మళ్లీ తమ స్థావరాలను ఏర్పాటు చేసుకోకుండా చూడటానికి లెబనీస్ ఆర్మీని ఇంకా మోహరించలేదని ఇజ్రాయెల్ చెబుతోంది. అందుకే తాము ఇంకా కొన్ని రోజులు లెబనాన్‌లోనే ఉండాల్సిన అవసరం ఉందని చెప్పింది.