తెలంగాణ

telangana

'జపోరిజియా' న్యూక్లియర్​ పవర్​ ప్లాంట్​పై దాడి! - Zaporizhzhya Nuclear Plant In Fire

By ETV Bharat Telugu Team

Published : Aug 12, 2024, 11:13 AM IST

Fire Hits Zaporizhzhya Nuclear Plant : రష్యా అధీనంలో ఉన్న జపోరియా అణువిద్యుత్తు కేంద్రంపై దాడి జరిగింది. దీంతో దాని కూలింగ్‌ టవర్‌లో పెద్దఎత్తున మంటలు ఎగసిపడ్డాయి. అయితే దీనిపై రష్యా, ఉక్రెయిన్​లు పరస్పరం నిందించుకుంటున్నాయి.

Zaporizhzhya nuclear power plant
Zaporizhzhya nuclear power plant (AP)

Fire Hits Zaporizhzhya Nuclear Plant :ఐరోపాలో అతిపెద్ద అణువిద్యుత్తు కేంద్రాల్లో ఒకటైన ఉక్రెయిన్‌కు చెందిన జపోరిజియాలో భారీగా మంటలు ఎగసిపడ్డాయి. ప్రస్తుతం రష్యా ఆధీనంలో ఈ ప్లాంట్‌ ఉంది. అయితే ఈ ప్లాంట్‌లో మాస్కో దళాలే పేలుళ్లకు పాల్పడ్డాయని ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌స్కీ ఆరోపించారు. వారు కీవ్‌ను బ్లాక్‌ మెయిల్‌ చేసేందుకు ఈ చర్యకు పాల్పడ్డారని పేర్కొన్నారు. మరోవైపు ఉక్రెయిన్‌ దళాలు ప్రయోగించిన ఫిరంగి గుండ్ల కారణంగానే మంటలు వ్యాపించాయని రష్యా ప్రత్యారోపణలు చేస్తోంది.

ప్రస్తుతం జపోరియా అణువిద్యుత్ కేంద్రంలో, అంతర్జాతీయ అణుశక్తి సంస్థకు చెందిన సిబ్బంది కూడా ఉన్నారు. ప్రస్తుతానికి ఎటువంటి అణు లీక్‌ చోటుచేసుకోలేదని వారు చెప్పారు. అయితే మంటలు వ్యాపించిన ప్రదేశానికి తమను వెళ్లనీయాలని కోరారు.

డోంట్ వర్రీ - ఆర్పేశాం
జపోరియా అణువిద్యుత్తు కేంద్రానికి సంబంధించిన కూలింగ్‌ టవర్‌లో ఆదివారం భారీగా మంటలు చెలరేగాయి. ఈ విషయాన్ని అక్కడ విధులు నిర్వహిస్తున్న రష్యా నియమిత గవర్నర్‌ యూవ్‌గెవ్‌నీ బాలిటెస్కీ పేర్కొన్నారు. తమ దళాలు వాటిని సోమవారం నాటికి పూర్తిగా ఆర్పేశాయని వెల్లడించారు.

2022లో రష్యా దళాలు, ఉక్రెయిన్​కు చెందిన జపోరియా అణు విద్యుత్​ కేంద్రాన్ని తమ అధీనంలోకి తీసుకొన్నాయి. దీంతో రెండేళ్ల నుంచి ఇక్కడ విద్యుదుత్పత్తిని నిలిపివేశారు. మొత్తం ఆ రియాక్టర్లను ఈ ఏడాది ఏప్రిల్‌ నుంచి కోల్డ్‌ షట్‌డౌన్‌లో ఉంచారు. తాజాగా ఈ ప్లాంట్‌ కూలింగ్‌ టవర్‌పై జరిగిన డ్రోన్‌ దాడిని అంతర్జాతీయ అణుశక్తి సంస్థ నిపుణులు ఎక్స్‌లో వెల్లడించారు.

కస్క్‌లో భీకరపోరు
రెండేళ్లుగా సాగుతున్న యుద్ధంలో ఉక్రెయిన్ తొలిసారి రష్యా ప్రధాన భూభాగంలోకి దాదాపు 15 కిలోమీటర్ల మేర చొచ్చుకెళ్లి దాడులు చేసింది. దీంతో రష్యాలోని సరిహద్దు ప్రాంతమైన కస్క్‌ నుంచి ఇప్పటికే అనేక మంది సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లారు. దాదాపు నాలుగు రోజులుగా ఇరు దేశాల మధ్య ఈ ప్రదేశంలోనే భీకరంగా దాడులు జరుగుతున్నాయి.

మరోవైపు ఉక్రెయిన్‌కు చెందిన కమాండ్ పోస్టు, సైనిక వాహనాలను ధ్వంసం చేసినట్లు రష్యా రక్షణ శాఖ తెలిపింది. 22వ మెకనైజ్డ్‌బ్రిగేడ్‌కు చెందిన 15మంది కమాండర్లను చంపేందుకు వ్యూహాత్మక ఇస్కందర్ క్షిపణలను ఉపయోగించినట్లు వెల్లడించింది. కస్క్‌ వైపు ఉక్రెయిన్ 1120 మంది సైనికులు, యుద్ధ ట్యాంకులు సహా ఇతర కీలక యుద్ధ సామగ్రిని కోల్పోయిందని రష్యా పేర్కొంది. కస్క్‌ నుంచి ఉక్రెయిన్‌ బలగాలు మరింత ముందుకు చొచ్చుకెళ్లకుండా రష్యా బలగాలు నిరోధిస్తున్నాయని తెలిపింది. కస్క్‌ ప్రాంతంలో ఉక్రెయిన్‌కు చెందిన 26 డ్రోన్‌లను నేలకూల్చినట్లు రష్యా రక్షణ శాఖ వెల్లడించింది. ఉక్రెయిన్‌బలగాలు, యుద్ధ సామగ్రి లక్ష్యంగా SU-34 ఫైటర్‌జెట్‌బాంబులను జారవిడించిందని తెలిపింది. అటు రష్యాకు చెందిన సహజ వాయువు క్షేత్రాన్ని, అనేక నౌకలను ధ్వంసం చేసినట్లు ఉక్రెయిన్ వెల్లడించింది. కస్క్‌ ప్రాంతంలో తమ బలగాలు దాడులు చేస్తున్నాయని ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌స్కీ తొలిసారి మీడియాకు తెలిపారు.

'సేవల రంగంలోని టిప్‌లపై పన్ను ఎత్తివేస్తాం' - కమలా హారిస్‌ హామీ - Kamala Harris Election Pledges

బంగ్లాదేశ్‌లో హిందూ మైనారిటీల భారీ ప్రదర్శన - Bangladesh Hindus Protest

ABOUT THE AUTHOR

...view details