Maldives Tourism Loss :ప్రధాని నరేంద్ర మోదీ లక్షద్వీప్ పర్యటన తర్వాత మాల్దీవులతో నెలకొన్న వివాదం ఆ దేశ పర్యాటకంపై చూపుతున్న తీవ్ర ప్రభావం అధికారిక లెక్కల్లో స్పష్టంగా కనిపిస్తోంది. భారత్ నుంచి మాల్దీవుల పర్యటనకు వెళ్లే వారి సంఖ్య మూడు వారాల వ్యవధిలో 8 శాతానికి తగ్గింది. గతేడాది మాల్దీవులకు విదేశీ పర్యటకుల రాకలో భారత్ అగ్రస్థానంలో ఉండగా, ఇప్పుడు ఐదో స్థానానికి పడిపోయింది. భారత సెలెబ్రెటీలు, ప్రముఖులు, సామాన్యుల నుంచి ఎదురైన వ్యతిరేకతే ఇందుకు కారణమైంది. ప్రధాని మోదీపై మాల్దీవుల మంత్రులు వివాదాస్పద వ్యాఖ్యల తర్వాత ఇరు దేశాల మధ్య దౌత్యపరమైన వివాదం నెలకొనగా, మాల్దీవుల పర్యటకంలో అనూహ్య మార్పులు జరుగుతున్నాయి.
టాప్ నుంచి ఐదో స్థానానికి భారత్!
Maldives Tourism Statistics : మాల్దీవుల పర్యటక శాఖ తాజాగా విడుదల చేసిన లెక్కలను పరిశీలిస్తే గతేడాది డిసెంబర్ 31 నాటికి 2,09,198 మంది పర్యటకులతో భారత్ అగ్రస్థానంలో ఉండేది. అప్పుడు మాల్దీవుల్లో భారత సంద్శకుల వాటా దాదాపు 11 శాతంగా ఉంది. వివాదం తర్వాత ఈనెల 28 వరకు మాల్దీవుల టూరిజంలో భారత్ వాటా 8 శాతానికి పడిపోయింది. ఈ ఏడాది ఇప్పటివరకు కేవలం 13,989 మంది భారతీయులు మాత్రమే మాల్దీవుల్లో పర్యటించారు. 2024 జనవరి నెలలో అత్యధిక మంది పర్యటకులను మాల్దీవులకు పంపిన దేశాల్లో 18,561 మందితో రష్యా తొలి స్థానంలో నిలిచింది. 18,111 మంది టూరిస్టులతో రెండో స్థానంలో ఇటలీ, 16,529 మంది సందర్శకులతో మూడోస్థానంలో చైనా నిలిచింది. 14,588 మంది టూరిస్టులతో నాలుగో స్థానంలో బ్రిటన్ ఉంది.
'భారత్కు క్షమాపణలు చెప్పాలి'
మరోవైపు రెండు దేశాల మధ్య నెలకొన్న వివాదంపై మాల్దీవుల ప్రతిపక్ష పార్టీ జేపీ(జుమ్‌హూరీ పార్టీ) నేత ఖాసిం ఇబ్రహీం స్పందించారు. తమ అధ్యక్షుడు మహమ్మద్ ముయిజ్జు భారత ప్రజలకు, ప్రధాని నరేంద్ర మోదీకి అధికారికంగా క్షమాపణలు చెప్పాలని కోరారు. ఈ మేరకు ఆ దేశ స్థానిక మీడియా వాయిస్ ఆఫ్ మాల్దీవ్స్ నివేదించింది. కాగా, ఈ వార్తలపై మాల్దీవుల ప్రభుత్వం ఇంకా స్పందించలేదు.