Lunar Eclipse On Holi :మార్చి 25న హోలీ పండుగతో పాటు ఆకాశంలో అద్భుత ఘట్టం ఆవిష్కృతం కాబోతోంది. అదే 'పెనంబ్రల్ చంద్రగ్రహణం'. ఈనేపథ్యంలో 'పెనంబ్రల్ చంద్రగ్రహణం' అంటే ఏమిటి ? అది ఏ సమయంలో సంభవిస్తుంది? మన దేశంలో కనిపిస్తుందా ? అనే అంశాలపై ఆసక్తికర సమాచారాన్ని ఇప్పుడు తెలుసుకుందాం.
భూమి, చంద్రుడు, సూర్యుడు ఒకే సరళ రేఖపైకి వచ్చినపుడు గ్రహణాలు సంభవిస్తుంటాయి. చంద్రుడికి, సూర్యుడికి మధ్య భూమి అడ్డుగా వచ్చి ఆ నీడ చంద్రుడిపై పడినప్పుడు చంద్రగ్రహణం ఏర్పడుతుంది. ఆ సమయంలో చంద్రుడు కనిపించడు. ఇది పౌర్ణమి నాడు సంభవిస్తుంది. ఫలితంగా పౌర్ణమిరోజు గ్రహణ సమయంలో పూర్ణ చంద్రుడు కనిపించడు. అయితే అన్ని పౌర్ణమిలలోనూ చంద్రగ్రహణం ఏర్పడదు. చంద్ర గ్రహణానికి ముందు ఎరుపు రంగులో చంద్రుడు ప్రకాశిస్తాడు. సూర్యకాంతి పొందిన భూమి వాతావరణం దానిపై ప్రతిబింబించడం వల్ల చంద్రుడు ఎర్రగా కనిపిస్తాడు.
పెనంబ్రల్ చంద్రగ్రహణం అంటే ?
చంద్ర గ్రహణాలు మూడు రకాలు. అవి సంపూర్ణ, పాక్షిక, పెనుంబ్రల్ చంద్ర గ్రహణాలు (Penumbral Eclipse). మార్చి 25న ఏర్పడబోయేది పెనంబ్రల్ చంద్రగ్రహణం. పాక్షిక, సంపూర్ణ గ్రహణాల కంటే పెనంబ్రల్ చంద్ర గ్రహణాన్ని గుర్తించడానికి నిశిత పరిశీలన అవసరం. పెనంబ్రల్ చంద్రగ్రహణం ఏర్పడే సమయంలో చంద్రుడు ఎరుపు రంగులో కాకుండా మరింత చీకటిలో ఉన్నట్లుగా కనిపిస్తాడు.