Largest Gold Mine In The World :"ఒకే చోట 1100 టన్నుల బంగారం. రూ.7 లక్షల కోట్లు విలువ. దీంతో చైనా దిశ తిరిగిపోతుంది. నెమ్మదించిన చైనా ఆర్థిక పరిస్థితి ఇక పరుగులు పెడుతుంది!. ప్రపంచవ్యాప్తంగా బంగారం ధరపై ఇది తీవ్ర ప్రభావం చూపుతుంది."-- గత కొద్ది రోజులుగా సర్వత్రా నడుస్తున్న చర్చ ఇది. అసలు అంత మొత్తంలో బంగారం ఎక్కడ ఉంది? దానికీ చైనాకు సంబంధం ఏమిటి? చైనా ఆర్థిక వ్యవస్థకు అది ఎలా సహాయపడుతుంది? బంగారం ధరపై ఎందుకు ప్రభావం పడుతుంది? అనే విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం.
అంత బంగారం ఎక్కడ ఉంది?
ప్రపంచలోకెల్లా అతిపెద్ద గోల్డ్ సరఫరాదారుగా ఉన్న చైనాకు మరో జాక్పాట్ తగిలినట్లైంది. ఇటీవల మధ్య చైనాలోని పింగ్జియాంగ్ ప్రాంతంలోని ఈశాన్య హునన్ కౌంటీ 'వాంగ్జు గోల్డ్ ఫీల్డ్'లో- దాదాపు 2 కీలోమీటర్ల లోతులో ప్రపంచంలోనే అతిపెద్ద బంగారం నిల్వలను గుర్తించారు. అందులో దాదాపు 1000 మెట్రిక్ టన్నులు లభ్యం అవుతుందని, దాని విలువ 83 బిలియన్ డాలర్లు(దాదాపు రూ.7 లక్షల కోట్లు) ఉంటుందని అంచనా. ఈ మేరకు జియాలాజికల్ బ్యూరో ఆఫ్ హునన్ ప్రావిన్స్ ఓ ప్రకటనలో తెలిపింది. అయితే, 3 కిలోమీటర్ల లోపల అదనపు బంగారు నిల్వలు ఉండే అవకాశం ఉన్నట్లు త్రీడీ మోడలింగ్ ద్వారా వెల్లడైనట్లు చెప్పింది.
ఇప్పటివరకు అతిపెద్ద బంగారు గని రికార్డు సౌత్ ఆఫ్రికాలోని 'సౌత్ డీప్ మైన్' పేరు మీద ఉంది. ఈ గనిలో 930 టన్నుల బంగారు నిల్వలు ఉన్నాయి. ఇటీవల చైనాలో గుర్తించిన మైన్ ఈ రికార్డును బద్దలుగొట్టింది.