Korean Countries Balloons War : క్షిపణులు, శతఘ్నులతో పరస్పరం కవ్వించుకునే రెండు కొరియా దేశాలు కొత్తదారులు వెతుక్కుంటున్నాయి. ఇన్ని రోజులు చెత్త, విసర్జన పదార్థాలు నిండిన భారీ గాలిబుడగలను దక్షిణ కొరియాకు పంపి ఉత్తర కొరియా కవ్వించగా, ఇప్పుడు సియోల్ అనూహ్య ప్రతిచర్యలకు దిగింది. పెద్ద పెద్ద లౌడ్ స్పీకర్లను సరిహద్దుల వద్ద మోహరించి దక్షిణ కొరియా వ్యతిరేక ప్రచారం చేస్తోంది.
హోరెత్తిస్తున్న దక్షిణ కొరియా సైన్యం
గత కొన్ని వారాలుగా వందలాదిగా చెత్తతో నింపిన గాలిబుడగలను పంపుతూ కవ్విస్తున్న ఉత్తర కొరియాకు దక్షిణ కొరియా గట్టి జవాబిస్తోంది. సరిహద్దుల్లో పెద్ద పెద్ద లౌడ్‌స్పీకర్లను ఏర్పాటు చేసి ఉత్తర కొరియా వ్యతిరేక ప్రచారాలను ప్రారంభించింది. సైనిక స్థావరాలు ఉన్న ఉత్తర కొరియా ప్రాంతాల్లో లౌడ్ స్పీకర్ల ద్వారా K-పాప్ సంగీతం, విదేశీవార్తలతోపాటు, ప్యాంగ్యాంగ్ వ్యతిరేక ప్రసారాలను దక్షిణ కొరియా సైన్యం హోరెత్తిస్తోంది.
సైనిక బలగాలకు ఆదేశాలు!
ఉత్తర కొరియాలో విదేశీ వార్తలు, కె-పాప్ సంగీత శ్రవనాన్ని తీవ్ర నేరాలుగా పరిగణిస్తారు. అవి తమ పౌర సమాజంలో ప్రభుత్వ వ్యతిరేక భావాలను నాటుతుందని, తన అధికారాన్ని బలహీనపరుస్తుందని నియంత కిమ్ జోంగ్ ఉన్ భావిస్తారు. 2015లో ఇలాగే దక్షిణ కొరియా లౌడ్ స్పీకర్లతో ఉత్తర కొరియా వ్యతిరేక ప్రచారం చేయగా ప్రతిచర్యగా కిమ్ ప్రభుత్వం ఫిరంగులను పేల్చింది. అప్పట్లో అది ఉద్రిక్త పరిస్థితులకు తావిచ్చింది. మళ్లీ ఆ పరిస్థితులే ఎదురైతే ఎదుర్కొనేందుకు సంసిద్ధంగా ఉండాలని దక్షిణ కొరియా రక్షణ మంత్రి సైనిక బలగాలను ఆదేశించారు.