Kamala Harris Pledges To End Taxes On Tips : రెస్టారెంట్లలో పని చేసే కార్మికులతోపాటు, ఇతర సేవల రంగాల్లోని వారికి ఇచ్చే టిప్‌లపై పన్నును ఎత్తివేస్తామని డెమోక్రటిక్ పార్టీ అధ్యక్ష అభ్యర్థి కమలా హారిస్ హామీ ఇచ్చారు. అమెరికాలోని కార్మిక కుటుంబాల తరఫున పోరాడతానని ఆమె పేర్కొన్నారు. లాస్ వేగాస్‌లోని యూనివర్సిటీ ఆఫ్ నెవాడాలో జరిగిన ర్యాలీలో ఆమె ప్రసంగించారు. హోటళ్లు, రెస్టారెంట్లు, వినోద పరిశ్రమలపై దేశ ఆర్థిక వ్యవస్థ ఆధారపడి ఉందని కమలా హారిస్ పేర్కొన్నారు.
"ప్రతి ఒక్కరికీ ఇది నా హామీ. నేను అధ్యక్షురాలినయ్యాక అమెరికాలోని పని చేసే కుటుంబాల కోసం పోరాడతా. కనీస వేతనాలు పెంచేందుకు కృషి చేస్తా. టిప్‌లపై పన్నును ఎత్తివేస్తా" అని కమలా హారిస్ హామీ ఇచ్చారు.
కమల హారిస్ కాపీ కొట్టారు!
సేవల రంగంలోని టిప్‌లపై పన్ను ఎత్తివేస్తానని గతంలోనే రిపబ్లికన్ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ హామీ ఇచ్చారు. ఈ నేపథ్యంలో కమలా హారిస్ ఇచ్చిన హామీపై ఆయన స్పందించారు. ‘పన్నులేని నా విధానాన్ని కమలా హారిస్ కాపీ కొట్టారు’ అని ఎద్దేవా చేశారు. ఎన్నికల కోసం ఆమె ఈ హామీ ఇచ్చారని, దానిని అమలు చేయలేరని ఘాటుగా విమర్శించారు.