Joe Biden Exit From US Presidential Race : అమెరికా అధ్యక్ష ఎన్నికల బరి నుంచి వైదొలగాలని అధ్యక్షుడు జో బైడెన్ తీవ్రంగా ఆలోచిస్తున్నట్లు సమాచారం. ఒకవైపు సొంత పార్టీ నేతల నుంచి వ్యతిరేకత, మరోవైపు ఆరోగ్య సమస్యలు ఉన్న నేపథ్యంలో బైడెన్ అధ్యక్ష ఎన్నికల రేసులో కొనసాగడంపై ఆత్మ శోధన చేసుకుంటున్నట్లు తెలుస్తోంది. ఈ వారాంతంలోపే దీనిపై బైడెన్ కీలక ప్రకటన చేయనున్నట్లు అమెరికా మీడియాలో కథనాలు వస్తున్నాయి.
పెరుగుతున్న ఒత్తిళ్లు
అమెరికా అధ్యక్ష రేసు నుంచి అధ్యక్షుడు జో బైడెన్ వైదొలగాలని సర్వత్రా డిమాండ్లు వినిపిస్తున్నాయి. అక్కడి మీడియా కథనాలు కూడా ఇదే విషయాన్ని కోడై కూస్తున్నాయి. అటు సొంత పార్టీ నేతల నుంచే బైడెన్‌కు నానాటీకి వ్యతిరేకత పెరుగుతోంది. ఇటీవల మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా సైతం ఆయన అభ్యర్థిత్వంపై ఆందోళన వ్యక్తం చేశారు. దీనితో బైడెన్‌పై మరింత ఒత్తిడి పెరిగింది. మరోవైపు ఆయన ఆరోగ్యంపైన అందరిలోనూ సందేహాలు నెలకొనడంతో, ఆయన తప్పుకొవాలనే డిమాండ్ మరింత ఎక్కువైంది. ఈ నేపథ్యంలో రేసులో కొనసాగడంపై బైడెన్ ఆత్మ శోధన చేసుకుంటున్నట్లు సమాచారం. ఈ వారాంతంలోపే దీనిపై ఆయన కీలక ప్రకటన చేయనున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు అమెరికా మీడియాలో కథనాలు వస్తున్నాయి.
నవంబరులో జరిగే ఎన్నికల్లో తాను గెలిచే అవకాశాలు లేవనే వాస్తవాన్ని బైడెన్ అంగీకరించినట్లు ఆయన సన్నిహితులు వెల్లడించినట్లు న్యూయార్క్ టైమ్స్ తన కథనంలో పేర్కొంది. సొంత పార్టీ నుంచి డిమాండ్లు వస్తున్న తరుణంలో ఆయన రేసు నుంచి వైదొలిగే అవకాశాలున్నట్లు వారు చెప్పినట్లు న్యూయార్క్ టైమ్స్ తెలిపింది. పోటీ నుంచి వెనక్కి తగ్గే అంశంపై బైడెన్ తీవ్రంగా ఆలోచిస్తున్నారని, దీనిపై ఆత్మ పరిశీలన చేసుకుంటున్నారని డెమొక్రటిక్ పార్టీ వర్గాలను ఉటంకిస్తూ మరో పత్రిక వెల్లడించింది.
సొంత పార్టీ నుంచే వ్యతిరేకత
మరోవైపు అమెరికా అధ్యక్ష ఎన్నికల బరి నుంచి బైడెన్ వైదొలగాలని మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా తన అభిప్రాయాన్ని వ్యక్తం చేసినట్లు అక్కడి మీడియా కథనాలు పేర్కొన్నాయి. అధ్యక్ష ఎన్నికల్లో బైడెన్ విజయావకాశాలు తగ్గిపోయానని, పోటీ చేయడంపై ఆయన పునరాలోచించుకోవాలని తన మిత్రులతో ఒబామా చెప్పినట్లు వాషింగ్టన్ పోస్టు కథనం వెల్లడించింది. డెమొక్రటిక్ పార్టీ సీనియర్ నేత, మాజీ హౌస్ స్పీకర్ నాన్సీ పెలోసీ కూడా బైడెన్‌పై నేరుగా అసంతృప్తి వ్యక్తం చేసినట్లు అమెరికా పత్రికల్లో కథనాలు వస్తున్నాయి. బైడెన్‌కు నేరుగా ఫోన్ చేసిన నాన్సీ రేసు నుంచి వైదొలగాలని కోరినట్లు సీఎన్ఎన్ తన కథనంలో పేర్కొంది. ట్రంప్‌ను ఓడించలేరని, ఎన్నికల సూచీలు వెల్లడిస్తున్నాయని బైడెన్‌కు నాన్సీ చెప్పినట్లు తెలిపింది. దీంతోపాటు 81 ఏళ్ల బైడెన్ కనుక అధ్యక్ష రేసులో కొనసాగితే నవంబర్ ఎన్నికల్లో ప్రతినిధుల సభలో కూడా డెమొక్రాట్ల అవకాశాలు తీవ్రంగా దెబ్బతింటాయని నాన్సీ ఆందోళన వ్యక్తం చేసినట్లు సీఎన్ఎన్ కథనం వెల్లడించింది. సెనేట్ నేత చాక్ స్కూమర్, కాలిఫోర్నియా డెమొక్రటిక్ ప్రతినిధి ఆడమ్ షిఫ్ కూడా బైడెన్ రేసు నుంచి వెనక్కి తగ్గాలని కోరినట్లు పేర్కొన్నాయి.
ఇక చాలు!
ఇన్ని ప్రతికూలతలు ఉన్న నేపథ్యంలో అధ్యక్ష రేసులో కొనసాగడంపై బైడెన్ ఆత్మ శోధన చేసుకుంటున్నట్లు తెలుస్తోంది. ఇటీవల కొవిడ్ బారిన పడిన బైడెన్ ప్రస్తుతం డెలావర్‌లోని తన ఇంట్లో క్వారంటైన్‌లో ఉన్నారు. తాను తీవ్ర అనారోగ్యానికి గురైతే అధ్యక్ష రేసు నుంచి వైదొలగడంపై ఆలోచిస్తానని ఇటీవల ఓ ఇంటర్వ్యూలో బైడెన్ చెప్పారు. ఈ తరుణంలో కొవిడ్ నుంచి కోలుకున్న తర్వాత ఈ వారాంతంలో అధ్యక్ష ఎన్నికల్లో నిలిచేదీ లేదా తప్పుకునేది అధికారికంగా ప్రకటించే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. ఆయన స్థానంలో ఉపాధ్యక్షురాలు కమలా హారిస్‌ను డెమొక్రాట్ల అధ్యక్ష అభ్యర్థిగా ప్రకటించనున్నట్లు సమాచారం. ఇప్పటికే ఆమె పోటీ కోసం సన్నద్ధమవుతున్నట్లు మీడియాలో వార్తలు వస్తున్నాయి. తన రన్నింగ్ మేట్ ఎవరనే దానిపై ఆమె విస్తృత చర్చలు జరుపుతున్నట్లు తెలుస్తోంది.
మైక్రోసాఫ్ట్ సర్వర్ క్రాష్ - ఎయిర్‌పోర్ట్‌లు, బ్యాంకులు, మీడియా కార్యకలాపాలకు బ్రేక్ - Microsoft Service Outage
రిపబ్లికన్ పార్టీ నామినేషన్‌ను అంగీకరించిన డొనాల్డ్ ట్రంప్ - తన విజయం తథ్యం అని ధీమా! - Trump Republican Party Nomination