Joe Biden Memory : అమెరికా అధ్యక్ష ఎన్నికలకు ముందు జో బైడెన్‌కు రహస్యపత్రాలకు సంబంధించిన నివేదిక అంశాలు ఇబ్బందికలిగించేలా మారాయి. అమెరికా రహస్య పత్రాలను బైడెన్ తన ఇంట్లో పెట్టుకోవడంపై ఓ నివేదిక ఇచ్చిన స్పెషల్ కౌన్సిల్ అందులో బైడెన్ జ్ఞాపకశక్తిపై సందేహాలు వ్యక్తం చేసింది. బైడెన్‌ను జ్ఞాపకశక్తి తక్కువగా ఉన్న వృద్ధుడని పేర్కొంది. కాగా, ఈ నివేదికను బైడెన్ తీవ్రంగా ఖండించారు. తనకు అన్ని స్పష్టంగా గుర్తుంటాయని చెప్పారు. అయితే ఇలా చెప్పిన కొద్ది సేపటికే మెక్సికో సరిహద్దుల్లో గాజా ఉందంటూ ఓ ప్రెస్మీట్లో చెప్పటం వల్ల మళ్లీ చర్చనీయాంశంగా మారింది.
ఈజిప్టు అధ్యక్షుడిని మెక్సికో ప్రెసిడెంట్‌గా
హుర్ నివేదిక గురించి తెలుసుకున్న జో బైడెన్ తనకు అన్ని విషయాలు గుర్తుంటాయని ఓ విలేకర్ల సమావేశంలో అన్నారు. అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన దగ్గర నుంచి ఎన్ని పనులు చేశానో చూడండి అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. అదే సమయంలో గాజాకు మానవీయ సాయం పంపడంపై బైడెన్‌ను విలేకర్లు ప్రశ్నించారు. దానికి ఈజిప్టు అధ్యక్షుడుని మెక్సికో ప్రెసిడెండ్‌గా పేర్కొన్నారు.' మీకు ముందే తెలుసు. మెక్సికో అధ్యక్షుడు ఎల్ సీసీ సరిహద్దులు (గాజా సరిహద్దులు) తెరిచి మానవీయ సాయం పంపేందుకు ఇష్టపడలేదు. నేను ఆయనతో మాట్లాడి గేట్లు తెరిపించాను' అని బైడెన్ సమాధానం ఇచ్చారు. దీంతో అక్కడ ఉన్నవారు అంతా అవాక్కయ్యారు. ఆ తర్వాత అధ్యక్ష కార్యాలయ ప్రతినిధులు ఆ తప్పును సరిదిద్దాల్సి వచ్చింది.
ఇప్పటికే అధ్యక్ష ఎన్నికల ప్రచారంలో దూకుడుగా ఉన్న రిపబ్లికన్ల చేతికి ఈ వీడియో క్లిప్ చేరింది. ఆ వీడియోను ఎక్స్‌లో బలహీనం, బాధాకరం, ఇక్కడ చూసేందుకు ఏమీలేదు అంటూ ట్రంప్ సలహాదారులు క్రిస్ లాసివిట, జేసన్ మిల్లర్లు కామెంట్లు పెడుతూ పోస్ట్ చేశారు. ఇప్పటికే బైడెన్ వృద్ధాప్యాన్ని, జ్ఞాపకశక్తిని తమ ప్రధాన ఎన్నికల అస్త్రంగా ప్రత్యర్థులు వాడుకుంటున్నారు.