Joe Biden Drops Out Of Presidential Race : అమెరికా అధ్యక్ష ఎన్నికల రేసు నుంచి డెమొక్రటిక్ అభ్యర్థి, ప్రస్తుత అధ్యక్షుడు జో బైడెన్ వైదొలిగారు. ఈ విషయాన్ని స్వయంగా ఆయనే ఆదివారం ప్రకటించారు. ఈ మేరకు పార్టీ కార్యకర్తలకు, దేశ ప్రజలకు ఓ లేఖ రాశారు. మరోవైపు కమలా హారిస్‌ను బైడెన్ స్థానంలో అధ్యక్ష ఎన్నికల రేసులో నిలపడానికి డెమొక్రటిక్ పార్టీ సిద్ధమవుతోందని తెలుస్తోంది.
గత కొంత కాలంగా బైడెన్ అభ్యర్థిత్వంపై సొంత పార్టీ నుంచే తీవ్ర వ్యతిరేకత వస్తోంది. డొనాల్డ్ ట్రంప్‌తో జరిగిన చర్చలోనూ ఆయన ఘోర వైఫల్యం చెందారు. దీనితో అధ్యక్ష ఎన్నికల రేసు నుంచి వైదొలగల్సిన పరిస్థితి తలెత్తింది. జూన్ నెల 27న జరిగిన టీవీ డిబేట్‌లో రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్, డెమోక్రాట్ల అభ్యర్థి బైడెన్ మధ్య జరిగిన సంవాదాన్ని యావత్ ప్రపంచం ఆసక్తిగా గమనించింది. ఈ చర్చలో ఇరువురు నేతలు ఒకరిపై ఒకరు తీవ్రంగా విమర్శలు చేసుకున్నప్పటికీ, ట్రంప్‌దే పైచేయిగా అంతా భావించారు. 81 ఏళ్ల బైడెన్ పలు సార్లు తడబాటుకు గురయ్యారు. కీలక సభల్లోనూ బైడెన్ నోటి వెంట తప్పులు దొర్లాయి. ఫలితంగా ఆయన అధ్యక్ష రేసులో ఉండడంపై సొంతపార్టీలోనే అనుమానాలు మొదలయ్యాయి. దానికితోడు పలువురు కీలక నేతలు ఆయన వైదొలగాలని, వేరొకరికి ఆ బాధ్యతలు అప్పగించాలని బహిరంగంగానే కోరారు.
మరోవైపు, బైడెన్ అభ్యర్థిత్వం పట్ల పార్టీ అసంతృప్తి రోజురోజుకూ తీవ్రమవుతుండగానే, ట్రంప్‌పై జరిగిన హత్యాయత్నం అమెరికా రాజకీయాలను ఒక్కసారిగా మార్చివేసింది. ఈ ఘటనతో ట్రంప్‌పై సానుభూతి విపరీతంగా పెరిగిపోయినట్లు పలు అంతర్జాతీయ కథనాలు వెల్లడించాయి. అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్‌దే పైచేయిగా ఉండబోతోందని పలు సర్వేలు వెల్లడించాయి.
బైడెన్‌పై కీలక నేతల అసంతృప్తి
ఈ క్రమంలోనే డెమొక్రటిక్ కీలక నేతలు ఒక్కొక్కరుగా బైడెన్ అధ్యక్ష ఎన్నికల రేసు నుంచి వైదొలగాలని బహిరంగంగా చెప్పడం మొదలుపెట్టారు. నవంబర్‌లో జరగనున్న అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్‌ను బైడెన్ ఓడించగలరా? అనేది తనకు తీవ్రమైన ఆందోళన కలిగిస్తోందని కాలిఫోర్నియో డెమొక్రటిక్ కీలక నేత ఆడమ్ షిఫ్ అనుమానం వ్యక్తం చేశారు. మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా సైతం అధ్యక్ష ఎన్నికల్లో బైడెన్ విజయావకాశాలు తగ్గిపోయాయని, పోటీపై పునరాలోచించుకోవాలని తన మిత్రులతో చెప్పినట్లు వాషింగ్టన్ పోస్టు ఓ కథనం ప్రచురించింది. పార్టీ సీనియర్ నేత, మాజీ స్పీకర్ నాన్సీ పెలోసీ కూడా బైడెన్‌పై నేరుగా అసంతృప్తి వ్యక్తం చేసినట్లు కథనాలు వెలువడ్డాయి. ఆమె నేరుగా బైడెన్‌కే ఫోన్ చేసి రేసు నుంచి వైదొలగాలని కోరినట్లు సమాచారం. అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్‌ను బైడెన్ ఓడించలేరన్న విషయాన్ని ఎన్నికల సూచీలు వెల్లడిస్తున్నాయని ఆమె తెలిపారు. ఇలా డెమొక్రటిక్ పార్టీలో తీవ్రమైన చర్చ జరుగుతున్న నేపథ్యంలో బైడెన్ కొవిడ్ బారినపడి ఐసోలేషన్‌లోకి వెళ్లారు.