Israeli forces withdraw from Jenin :గత 9 రోజులుగా ఆక్రమిత వెస్ట్‌బ్యాంక్‌లోని జెనిన్ నగరంలో చేపట్టిన ఆపరేషన్‌ను ఇజ్రాయెల్ సైన్యం ముగించింది. అంతేకాదు ఆ నగరం నుంచి తమ సైనిక దళాలను శుక్రవారం ఉపసంహరించుకుంది. మరోవైపు వెస్ట్‌బ్యాంక్‌లో ఆందోళకారులపై ఇజ్రాయెల్ సైన్యం కాల్పులు జరిపింది. ఈ ఘటనలో 26 ఏళ్ల అమెరికా పౌరురాలు మరణించింది. ఈ ఘటనపై అమెరికా స్పందించింది.
అమెరికన్ మహిళపై కాల్పులు
శుక్రవారం ఇజ్రాయెల్ సైన్యం వెస్ట్‌బ్యాంక్‌లో ఆందోళనకారులపై జరిపిన కాల్పుల్లో 26 ఏళ్ల అమెరికా పౌరురాలు ఆషినో ఏజ్గి ఏగి మృతి చెందారు. ఆమెకు టర్కీ పౌరసత్వం కూడా ఉంది. నబలస్‌లో ఇజ్రాయెలీ సెటిల్‌మెంట్ విస్తరణకు వ్యతిరేకంగా జరిగిన ఆందోళనల్లో ఆమె పాల్గొన్నారు. ఆ సమయంలోనే ఇజ్రాయెల్ సైన్యం కాల్పులు జరపగా, ఆమె మృతి చెందారు. ఈ ఘటనపై స్పందించిన అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోనీ బ్లింకెన్, మరింత సమాచారం కోసం వేచిచూస్తున్నామని, వచ్చిన వెంటనే తగు చర్యలు తీసుకుంటామని తెలిపారు. నబలస్‌లోనే 13 ఏళ్ల పాలస్తీనా చిన్నారి కూడా ఇజ్రాయెల్ దళాల కాల్పుల్లో ప్రాణాలు కోల్పోయింది. ఇజ్రాయెల్ సైన్యం చేసిన దాడుల్లో వెస్ట్‌బ్యాంక్‌లో మొత్తం 36 మంది పాలస్తీనియన్లు చనిపోయారు. ఒక్క జెనిన్ నగరంలోనే 21 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇందులో హమాస్, ఇతర సంస్థల మిలిటెంట్లు కూడా ఉన్నారు.