Israeli Airstrike On Gaza :ఇజ్రాయెల్- హమాస్‌ల మధ్య యుద్ధం కొనసాగుతోంది. ఇజ్రాయెల్ వరుస దాడులు పాలస్తీనా పౌరుల ప్రాణాలను బలితీసుకుంటున్నాయి. తాజాగా గాజాలోని జబాలియా ప్రాంతంలోని శరణార్థి శిబిరంపై ఇజ్రాయెల్ వైమానిక దాడులతో విరుచుకుపడింది. ఈ దాడుల్లో 19 మంది పాలస్తీనియన్లు మృతి చెందారు. అంతేకాదు ఇజ్రాయెల్ జరిపిన దాడుల్లో వేలాది మంది శిథిలాల కింద చిక్కుక్కున్నట్లు అధికారులు వెల్లడించారు.
పౌరులపై దాడి!
గత వారం రోజులుగా జబాలియా ప్రాంతంలో ఇజ్రాయెల్ జరుపుతున్న దాడుల్లో 150 మంది మృతి చెందినట్లు అధికారులు తెలిపారు. ఈ దాడుల నేపథ్యంలో స్థానిక నివాసితులు ఉత్తర, దక్షిణ ప్రాంతాలకు వెళ్లకుండా గాజాలోని హమాస్ అంతర్గత మంత్రిత్వశాఖ హెచ్చరికలు జారీ చేసింది. సురక్షితమనుకున్న ప్రాంతాల్లోనే దాడులు జరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేసింది. ఇజ్రాయెల్ సైన్యం తమ పౌర ప్రాంతాలను స్థావరాలుగా ఉపయోగించడాన్ని హమాస్ ఖండించింది. ఇప్పటి వరకు ఇజ్రాయెల్ జరిపిన దాడుల్లో 42 వేల పాలస్తీనియన్లు మరణించినట్లు గాజా ఆరోగ్య మంత్రిత్వశాఖ వెల్లడించింది.
మరణ మృదంగం
పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు రోజురోజుకూ పెరుగుతూనే ఉన్నాయి. ఇజ్రాయెల్ వరుసపెట్టి తమ శత్రువులపై దాడులు చేస్తూనే ఉంది. గురువారం లెబనాన్‌లోని సెంట్రల్ బీరుట్‌పై ఇజ్రాయెల్ భీకర వైమానిక దాడులు చేసింది. ఈ దాడిలో 22 మంది మరణించగా, 117 మంది తీవ్రంగా గాయపడ్డారు. అంతకు ముందు సెంట్రల్ గాజాలోని శరణార్థి శిబిరంలో ఉన్న పాఠశాలపై ఇజ్రాయెల్ దాడి చేసింది. ఈ వైమానిక దాడిలో 28 మంది మరణించగా, 54 మంది గాయపడ్డారు. ఈ వరుస వైమానిక దాడుల్లో గాయపడిన వేలాది మందితో అక్కడి ఆసుపత్రులు కిటకిటలాడుతున్నాయి.