Israel Air Strike On Gaza : గాజాపై ఇజ్రాయెల్ భీకర దాడులు కొనసాగిస్తూనే ఉంది. పునరావాస కేంద్రంగా మారిన పాఠశాల భవనంపై వైమానిక దాడికి పాల్పడింది. ఈ ఘటనలో 80 మందికిపైగా మరణించారు. మరో 50 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఈ విషయాన్ని పాలస్తీనా ఆరోగ్యశాఖ అధికారులు తెలిపారు. సెంట్రల్ గాజా సిటీలోని తబీన్ పాఠశాలపై శనివారం ఇజ్రాయెల్ ఈ దాడికి పాల్పడినట్లు చెప్పారు.
కాగా గత వారంలో గాజాలోని మూడు పాఠశాలలపై ఇజ్రాయెల్ దాడులకు పాల్పడింది. ఇటీవల ఓ పాఠశాలపై ఇజ్రాయెల్ జరిపిన దాడుల్లో 30 మంది మరణించగా పలువురు గాయాలపాలయ్యారు. ఆగస్టు 1న దలాల్ అల్-ముఘ్రాబీ స్కూల్‌పై చేసిన దాడుల్లో 15 మంది మరణించారు. అక్టోబరు 7న హమాస్ ఉగ్రవాదుల మెరుపు దాడుల నేపథ్యంలో అందుకు ప్రతీకారంగా గాజాపై ఇజ్రాయెల్ విరుచుకుపడుతోంది. కాగా ఈ యుద్ధంలో ఇప్పటివరకు గాజాలో 40,000 మందికి పైగా పాలస్తీనియన్లు మరణించారు.
సాకులు చెప్పకుండా చర్చలకు రండి!
ఇజ్రాయెల్-హమాస్ మధ్య కాల్పుల విరమణ కుదిర్చేందుకు జరుగుతున్న చర్చల్లో పురోగతి కనిపించడం లేదు. మధ్యవర్తులుగా అమెరికా, ఈజిప్టు, ఖతార్ చేస్తున్న ప్రయత్నాలు పెద్దగా ఫలించడం లేదు. విదివిధానాలను ఖరారు చేశామని, అమలు ఎలా చేయాలన్న అంశంపైనే ఇజ్రాయెల్-హమాస్ కూర్చుని మాట్లాడుకోవాల్సి ఉందని మూడు మధ్యవర్తిత్వ దేశాలు ఓ సంయుక్త ప్రకటన విడుదల చేశాయి. ఇందులో సాకులు చెప్పకుండా, సమయం వృథా చేయకుండా వచ్చి చర్చల్లో పాల్గొనాలని పేర్కొన్నాయి. ఈ ప్రకటనకు ఇజ్రాయెల్ స్పందించింది.