Israel Air Defence Systems : పది కాదు, ఇరవై కాదు ఏకంగా 300కుపైగా డ్రోన్లు, క్షిపణులతో ఒక దేశం ప్రత్యర్థి దేశంపై దాడికి దిగితే ఏంటి పరిస్థితి? అలాంటి దాడే తాజాగా ఇజ్రాయెల్‌పై జరిగింది. సిరియాలోని తమ రాయబార కార్యాలయంపై దాడి తర్వాత ప్రతీకారంతో రగిలిపోయిన ఇరాన్ అన్నట్లుగానే శనివారం ఇజ్రాయెల్‌పై దాడి చేసింది. ఆపరేషన్ ట్రూ ప్రామిస్ పేరుతో వందలాది డ్రోన్లు, మిస్సైళ్లను ఇజ్రాయెల్‌పై ప్రయోగించింది. కానీ వీటిన్నంటినీ ఇజ్రాయెల్ మాత్రం అమెరికా సాయంతో సునాయాసంగా సమర్థవంతంగా ఎదుర్కొంది. ఇందుకుగల ప్రధాన కారణం ఆ దేశ బహుళ అంచెల గగనతల రక్షణ వ్యవస్థే. మరి ఈ వ్యవస్థకు సంబంధించి పలు ఆసక్తికరమైన అంశాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
ది యారో
అమెరికా రూపొందించిన గగనతల వ్యవస్థే ఈ 'ది యారో'. బాలిస్టిక్ సహా ఏ తరహా దీర్ఘ శ్రేణి క్షిపణులనైనా ఈ వ్యవస్థ అడ్డుకోగలదు. భూవాతావరణం వెలుపలా పనిచేసే సామర్థ్యం దీనికి ఉంది. హమాస్ మిలిటెంట్లతో జరుగుతున్న యుద్ధంలో యెమెన్ నుంచి హూతీ వేర్పాటువాదులు ప్రయోగించిన క్షిపణులను కూడా ఇజ్రాయెల్ ఈ యారో వ్యవస్థతోనే అడ్డుకుంటోంది.
డేవిడ్ స్లింగ్
ఈ వ్యవస్థను కూడా అమెరికానే తయారుచేసింది. మధ్య శ్రేణి క్షిపణులను అడ్డుకోవడానికి ఇది సహాయపడుతుంది. లెబనాన్ నుంచి హెజ్‌బొల్లా ప్రయోగించే మిసైళ్లను నిలువరించడంలో ఇజ్రాయెల్ ఎక్కువగా ఈ వ్యవస్థనే ఉపయోగిస్తుంది.
పేట్రియాట్
మరో క్షిపణి రక్షణ వ్యవస్థ అయిన పేట్రియాట్‌ను ఇజ్రాయెల్ చాలాకాలం నుంచి వాడుతోంది. 1991లో జరిగిన గల్ఫ్ యుద్ధంలో దీని పేరు మార్మోగిపోయింది. ఇజ్రాయెల్‌పై ఇరాక్ ప్రయోగించిన స్కడ్ క్షిపణులను ఈ వ్యవస్థ విజయవంతంగా అడ్డుకుంది. ఇప్పుడు విమానాలను, డ్రోన్లు కూల్చడానికి దీనిని ఇజ్రాయెల్ వినియోగిస్తోంది.