Israel Warning To Lebanese :హమాస్‌ను సమూలంగా నిర్మూలించడమే లక్ష్యంగా భీకర దాడులు చేస్తున్న ఇజ్రాయెల్ ఆ సంస్థను మరోసారి దెబ్బకొట్టినట్లు తెలుస్తోంది. ఇప్పటికే పలువురు హమాస్‌కు చెందిన కీలక నేతలను హతమార్చిన ఇజ్రాయెల్ దళాలు, తాజాగా హమాస్ అధినేత, అక్టోబర్ 7 దాడుల రూపకర్త యాహ్యా సిన్వార్‌ను మట్టుబెట్టినట్లు తీవ్రస్థాయిలో ప్రచారం జరుగుతోంది. సిన్వార్ మరణించినట్లు ఇజ్రాయెల్ దళాలు అనుమానిస్తున్నాయి. ఈ మేరకు ఇజ్రాయెల్‌లోని పలు మీడియా సంస్థలు కథనాలను ప్రచురిస్తున్నాయి. సుదీర్ఘకాలంగా అతడి కదలికలు లేకపోవడం వల్ల ఇజ్రాయెల్ దళాలు అతడు సజీవంగా ఉండి ఉండకపోవచ్చని భావిస్తున్నాయి.
అయితే, హమాస్ అధినేత సిన్వార్ మృతి చెందినట్లు ఇజ్రాయెల్ అధికారికంగా ధ్రువీకరించడం లేదు. ఈ వాదనను బలపర్చే ఆధారాలేవీ తమ వద్ద లేవని ఇజ్రాయెల్ రక్షణ శాఖ-IDF చెబుతోంది. సిన్వార్ కదలికలు లేకపోవడం వల్ల పలుకోణాల్లో అనుమానిస్తున్నట్లు వెల్లడించింది.
ఆ దాడిలోనే మృతి!
ఇటీవల కాలంలో హమాస్ సొరంగాల వ్యవస్థను ఇజ్రాయెల్ తీవ్రంగా దెబ్బతీసింది. వీటిల్లో సిన్వార్ ఉన్నట్లు అనుమానించిన ప్రాంతాలు కూడా ఉన్నాయి. ఇటీవల సెంట్రల్ గాజాలోని హమాస్ కమాండ్ కంట్రోల్ సెంటర్‌పై ఇజ్రాయెల్ వైమానిక దాడులు జరిపింది. ఆ దాడిలో సమీపంలోని పాఠశాల కూడా ధ్వంసమైంది. ఈ దాడిలో 22మంది మృతి చెందినట్లు గాజా ఆరోగ్య శాఖ వెల్లడించింది. మృతి చెందిన వారిలో హమాస్ అధినేత ఉండొచ్చని ఇజ్రాయెల్ దళాలు అనుమానిస్తున్నాయి. ప్రస్తుతం సిన్వార్ మరణంపై ఇజ్రాయెల్ దళాలు దర్యాప్తు చేస్తున్నాయి.