తెలంగాణ

telangana

ETV Bharat / international

ట్రంప్‌ హత్యకు ఇరాన్‌ కుట్ర - కొన్ని వారాల క్రితమే ఇంటెలిజెన్స్‌ రిపోర్ట్‌ - కానీ! - Iran Threat To Trump

Iran Threat To Trump : అమెరికా మాజీ అధ్యక్షుడు ట్రంప్‌పై జరిగిన హత్యాయత్నానికి ముందే ఇరాన్‌ ఆయనను చంపడానికి కుట్ర పన్నినట్లు అమెరికన్‌ ఇంటెలిజెన్స్‌కు కొన్ని వారాల క్రితమే సమాచారం అందినట్లు తెలుస్తోంది. అయినా ట్రంప్​పై దాడి జరిగింది. అయితే ట్రంప్‌పై హత్యాయత్నం చేసిన 20 ఏళ్ల యువకుడికి, ఇరాన్‌ కుట్రతో ఎలాంటి సంబంధం లేదని అధికారులు తెలిపారు.

Iran threat prompted more security at Trump rally
Donald Trump's Secret Service protection had been increased (ANI)

By ETV Bharat Telugu Team

Published : Jul 17, 2024, 8:28 AM IST

Iran Threat To Trump :అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ హత్యకు ఇరాన్‌ కుట్ర పన్నినట్లు ఆ దేశ భద్రతా అధికారులకు కొన్ని వారాల క్రితమే ఇంటెలిజెన్స్‌ రిపోర్ట్‌ అందినట్లు తెలుస్తోంది. నిజానికి శనివారం పెన్సిల్వేనియాలో ఆయనపై జరిగిన కాల్పుల ఘటనకు, కొన్ని వారాల క్రితమే ఈ ఇంటెలిజెన్స్ రిపోర్ట్ అందింది. దీనితో ఆయనకు సీక్రెట్‌ సర్వీస్‌ వెంటనే భద్రతను పెంచింది. కానీ ఆయనపై మరొకరు దాడి చేశారు. అయితే ట్రంప్‌పై హత్యాయత్నం చేసిన 20 ఏళ్ల యువకుడికి, ఇరాన్‌ కుట్రతో ఎలాంటి సంబంధం లేదని అధికారులు ధ్రువీకరించారు.

ట్రంప్​నకు ముప్పు పొంచి ఉన్న నేపథ్యంలోనే ప్రచార కార్యక్రమాల్లో భద్రతను పెంచినట్లు అధికారులు తెలిపారు. ట్రంప్ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు, ఇరాన్‌ సుప్రీం కమాండర్‌ ఖాసిం సులేమానీని డ్రోన్‌ దాడిలో అమెరికా హతమార్చిన విషయం తెలిసిందే. అప్పటి నుంచి ట్రంప్​నకు ఇరాన్‌ నుంచి బెదిరింపులు వస్తూనే ఉన్నాయి.

ట్రంప్‌నకు పొంచి ఉన్న ముప్పునకు సంబంధించి తమకు నిరంతర సమాచారం అందుతోందని సీక్రెట్ సర్వీస్ ప్రతినిధి ఆంథోనీ గుగ్లియెల్మి వెల్లడించారు. అందుకు అనుగుణంగా భద్రతా వనరులను సర్దుబాటు చేస్తున్నామని ఆయన వివరించారు. నిర్దిష్టంగా ఫలానా వారి నుంచి ముప్పు తలెత్తినట్లు మాత్రం బహిరంగంగా ధ్రువీకరించలేమని పేర్కొన్నారు. అయితే, ప్రతి బెదిరింపును చాలా తీవ్రంగా పరిగణిస్తామని, అంతే వేగంగా ప్రతిస్పందిస్తామని స్పష్టం చేశారు. ట్రంప్‌ సహా ఆయన అధికారంలో ఉన్న సమయంలోని పాలకులకు ఇరాన్‌ నుంచి ఉన్న ముప్పుపై భద్రతా అధికారులు నిరంతర నిఘా కొనసాగిస్తున్నారని వైట్‌హౌస్ జాతీయ భద్రతా మండలి ప్రతినిధి అడ్రియన్ వాట్సన్ తెలిపారు.

ట్రంప్​ హత్యకు ఇరాన్ కుట్ర పన్నిందని వస్తున్న వార్తలను ఐక్యరాజ్య సమితిలోని ఇరాన్ మిషన్‌ తీవ్రంగా ఖండించింది. ఇవి నిరాధారమైన ఆరోపణలని పేర్కొంది. దురుద్దేశపూరిత ఆరోపణలను కొట్టిపారేసింది. ట్రంప్‌ ఒక నేరస్థుడని, అయితే ఆయన్ని కోర్టులోనే శిక్షించాల్సిన అవసరం ఉందని వ్యాఖ్యానించింది.

ఎన్నికల ప్రచారంలో ట్రంప్​
దాడి తరువాత వెంటనే కోలుకున్న ట్రంప్ ఎన్నిక ప్రచారంలో పాల్గొంటున్నారు. హత్యాయత్నం తరువాత తొలిసారిగా చెవికి కట్టుతో పార్టీ శ్రేణులకు కనిపించారు. ఆయన్ని చూస్తూనే వేలమంది రిపబ్లికన్‌ పార్టీ ప్రతినిధులు, అభిమానులు పెద్దపెట్టున జేజేలు పలికారు. సోమవారం రాత్రి విస్కాన్సిన్‌ రాష్ట్రంలోని మిల్వాకీ నగరంలో జరిగిన పార్టీ జాతీయ సదస్సులో ట్రంప్‌ పాల్గొన్నారు. ట్రంప్​ను అధ్యక్ష అభ్యర్థిగా, ఒహాయో సెనేటర్‌ జె.డి.వాన్స్‌ను ఉపాధ్యక్ష అభ్యర్థిగా ఖరారు చేసిన విషయం తెలిసిందే.

లోయలో పడ్డ బస్సు - 26 మంది మృతి, మరో 14 మందికి తీవ్రగాయాలు!

సేఫ్​ జోన్​పై ఇజ్రాయెల్​ దాడి- 60మందికి పైగా మృతి

ABOUT THE AUTHOR

...view details