Iran President Helicopter Crash : ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ హెలికాప్టర్ ప్రమాదంలో మరణించిన వార్త ప్రపంచాన్ని ఒక్కసారిగా ఉలిక్కిపడేలా చేసింది. ఇజ్రాయెల్-హమాస్ యుద్ధం, సిరియా సంక్షోభం, అణు ఒప్పందం, ఎర్ర సముద్రంలో హూతీ రెబెల్స్ దాడులు వంటి పలు సంక్షోభాలు నెలకొన్న వేళ ఇరాన్ వ్యూహాలను నడిపించాల్సిన అధ్యక్షుడు, విదేశాంగ మంత్రి ఇద్దరూ హెలికాప్టర్ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోవడం ఆ దేశానికి ఎదురు దెబ్బే.
మహమ్మద్ రైసీ ఇరాన్‌లోని బలమైన సంప్రదాయ వర్గానికి చెందిన వ్యక్తి. ఆయన 15వ ఏట క్వామ్‌లో మత విద్యను అభ్యసించారు. అక్కడే గతంలో ఇరాన్‌లోని ప్రముఖ ముస్లిం స్కాలర్లు కూడా చదువుకొన్నారు. రైసీ 20వ ఏట ఆయన్ను ప్రభుత్వం ప్రాసిక్యూటర్‌గా నియమించింది. పలు నగరాల్లో రైసీ విధులు నిర్వహించారు. 1983లో జమైలానుమను రైసీ వివాహం చేసుకొన్నారు. ఆ దంపతులకు ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. 1988లో రైసీ జీవితంలో అత్యంత వివాదాస్పదమైన బాధ్యతలను స్వీకరించారు. రాజకీయ ఖైదీలకు మరణశిక్షలను ఆయన పర్యవేక్షించారు. ఈ పదవితో ఆయన ప్రతిపక్షాల్లో అపఖ్యాతి పాలయ్యారు. అమెరికా కూడా ఆయనపై ఆంక్షలు విధించింది.
తొలిసారి పోటీ చేసి ఓటమి
1989లో ఖొమైనీ మరణం తర్వాత టెహ్రాన్ ప్రాసిక్యూటర్‌గా రైసీ బాధ్యతలను అందుకొన్నారు. 2016లో మషాద్‌లోని అస్టాన్ ఖుద్స్ రజావీ ఛైర్మన్‌గా నియమితులయ్యారు. 2015లో ఇరాన్ అణుఒప్పందం చేసుకోవడాన్ని రైసీ తీవ్రంగా వ్యతిరేకించారు. 2017లో నాటి అధ్యక్షుడు హసన్ రౌహానీపై అధ్యక్ష పదవి కోసం పోటీ చేసి ఓటమి పాలయ్యారు. కానీ, దేశంలోని అతివాద వర్గం నుంచి బలమైన మద్దతు ఆయనకు లభించింది. నాటి నుంచి అధ్యక్ష ఎన్నికల్లో గెలిచేందుకు ఏర్పాట్లు చేసుకోవడం మొదలుపెట్టారు. 2021లో ఆయన కల నెరవేరి ఆ ఎన్నికల్లో గెలిచారు. అప్పటికే ట్రంప్ అమెరికాను అణుఒప్పందం నుంచి బయటకు తెచ్చేశారు.