తెలంగాణ

telangana

ETV Bharat / international

భారీ వరదలకు 21మంది బలి- వేల ఇళ్లు ధ్వంసం- ప్రజలకు నరకం!

Indonesia Floods : భారీ వర్షాలతో ఇండోనేసియా అతలాకుతలమవుతోంది. సుమత్ర ద్వీపాన్ని కుండపోత వర్షాలు ముంచెత్తాయి. ఈ ప్రకృతి ప్రకోపంలో 21 మంది ప్రాణాలు కోల్పోయారు. ఎడతెగని వర్షాల కారణంగా రహదారులు నదులను తలపిస్తున్నాయి. వేలకొద్ది ఇళ్లు ధ్వంసమయ్యాయి.

Indonesia Floods
Indonesia Floods

By ETV Bharat Telugu Team

Published : Mar 10, 2024, 4:02 PM IST

Updated : Mar 10, 2024, 4:25 PM IST

Indonesia Floods :ఇండోనేసియాలోని సుమత్ర ద్వీపంలో కుంభవృష్టి వల్ల తలెత్తిన వరదల కారణంగా 21 మంది మృతి చెందగా, మరో ఏడుగురు గల్లంతయినట్లు అధికారులు వెల్లడించారు. ద్వీపం పశ్చిమ భాగంలోని పెసిసిర్‌ సెలటన్‌ జిల్లాలో నది ఉప్పొంగడం వల్ల టన్నుల కొద్దీ మట్టి, బండరాళ్లు నివాసాల్లోకి వచ్చినట్లు విపత్తు నిర్వహణ అధికారి తెలిపారు. కుండపోత కారణంగా భారీ వృక్షాలు సైతం నేలకొరిగినట్లు చెప్పారు.

వరదలతో నేలమట్టమైన నివాసాలు

గ్రామాల్లోకి మోకాళ్ల లోతున నీరు చేరింది. బోట్ల సాయంతో వర్షంలోనే ప్రజలను సురక్షిత ప్రాంతాలకు అధికారులు తరలించారు. వరద ఉద్ధృతితో రహదారులన్ని నదులను తలపిస్తున్నాయి. ఆకస్మిక వరదల కారణంగా రెండు గ్రామాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారని విపత్తు నిర్వహణ అధికారులు తెలిపారు. గల్లంతయిన ఏడుగురి కోసం సిబ్బంది గాలిస్తున్నట్లు వెల్లడించారు.

సహాయక చర్యల్లో రెస్క్యూ సిబ్బంది, స్థానిక యువత

80 వేల మంది నిరాశ్రయులు
గురువారం నుంచి పడాంగ్‌ సహా మొత్తం ఎనిమిది ప్రాంతాల్లో కొండచరియలు విరిగిపడి దాదాపు 200 ఇళ్లు నేలమట్టం అయినట్లు తెలిపారు. వరద ప్రభావిత ప్రాంతాల్లోని సుమారు 80 వేల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించినట్లు ప్రభుత్వం తెలిపింది. సుమత్ర ప్రావిన్స్‌లోని 9 జిల్లాల్లో 20 వేల ఇళ్లు ఈ భారీ వర్షాల కారణంగా నీటిలో మునిగినట్లు అధికారుల పేర్కొన్నారు.

కుంభవృష్టికి నేలకొరిగిన భారీ చెట్లు

పలుచోట్ల వంతెనలు, రోడ్లు దెబ్బతిన్నాయి. కొండచరియలు విరిగిపడి చాలా మార్గాలు మూసుకుపోయినట్లు అధికారులు తెలిపారు. మెరుపు వరదలతో సుతేరా ఉప జిల్లాలో 200 కుటుంబాలున్న గ్రామానికి ఇతర ప్రాంతాలతో సంబంధాలు తెగిపోయాయి. వరద నీరు తగ్గుముఖం పట్టినా కొండచరియల శిథిలాల కారణంగా సహాయ కార్యక్రమాలకు తీవ్ర ఆటంకం ఏర్పడింది.

వరదల కారణంగా దెబ్బతిన్న రహదారులు

'మున్ముందు భారీ వర్షాలు'
దాదాపు 150 మంది సిబ్బంది గాలింపు చర్యల్లో పాల్గొంటున్నారు. వరద బాధితుల కోసం తాత్కాలిక శిబిరాలు ఏర్పాటు చేశామని వారికి ఆహారం, ఔషధాలు, మంచినీరు సమకూరుస్తునట్లు ప్రభుత్వం తెలిపింది. ప్రస్తుతం పడాంగ్‌ ప్రాంతం మొత్తం నీటిలోనే ఉందని అధికారులు చెప్పారు. అయితే రాబోయే రోజుల్లో మరిన్ని భారీ వర్షాలు కురిసే ప్రమాదం ఉందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సంబంధిత అధికారులు హెచ్చరిస్తున్నారు. సాధారణంగా ఇండోనేసియాలో జనవరిలో వర్షాకాలం ప్రారంభమవుతుంది.

సముద్ర తాబేలు మాంసం తిని 9మంది మృతి- 78మందికి అస్వస్థత

'భద్రతా మండలిలో వెంటనే సంస్కరణలు చేపట్టాల్సిందే!'- UNOకు భారత్ వార్నింగ్​

Last Updated : Mar 10, 2024, 4:25 PM IST

ABOUT THE AUTHOR

...view details