Indian Students Killed In US :అమెరికాలో భారతీయ విద్యార్థులపై దాడులను శ్వేతసౌధం ఖండించింది. వీటిని అడ్డుకునేందుకు అధ్యక్షుడు బైడెన్ యంత్రాంగం శాయశక్తులా పనిచేస్తోందని ఓ ప్రకటనలో వెల్లడించింది. ఇటీవల అమెరికాలో వివిధ ప్రాంతాల్లో నలుగురు భారతీయ అమెరికన్ విద్యార్థులు మరణించారు. విద్యార్థుల భద్రతకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని డిమాండ్లు పెరుగుతున్న నేపథ్యంలో శ్వేతసౌధం స్పందించింది.
జాతి, లింగం, మతం లేదా మరే ఇతర అంశాల ఆధారంగా హింసను ఉపేక్షించేది లేదని శ్వేతసౌధం ప్రతినిధి జాన్ కిర్బీ తెలిపారు. అమెరికాలో ఇది ఏమాత్రం ఆమోదయోగ్యం కాదన్నారు. అటువంటి దాడులను అడ్డుకోవడానికి రాష్ట్ర, స్థానిక అధికారులతో కలిసి తాము చేయగలిగినదంతా చేస్తున్నామని పేర్కొన్నారు. అధ్యక్షుడితోపాటు ఆయన యంత్రాంగం దీనిపై చాలా కష్టపడి పని చేస్తోందని కిర్బీ వెల్లడించారు.
తీవ్ర ఆందోళనకు గురిచేస్తున్నాయ్!
అమెరికాలో ఉన్న భారతీయ విద్యార్థుల మరణాలు తీవ్ర ఆందోళనకు గురిచేస్తున్నాయని ఇండియన్ అమెరికన్ కమ్యూనిటీ నేత అజయ్ జైన్ పేర్కొన్నారు. అగ్రరాజ్యంలో చదువుతున్న విద్యార్థుల భద్రతకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. విద్యా సంస్థల యాజమాన్యాలు, స్థానిక పోలీసులు దీనిపై వేగంగా స్పందించి కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. ఇలాంటి ఘటనలు భారత్‌లో ఉన్న విద్యార్థుల కుటుంబసభ్యులను తీవ్ర ఆందోళనకు గురి చేస్తాయని చెప్పారు.