Indian Killed In Israel :లెబనాన్ భూభాగం నుంచి చేసిన క్షిపణి దాడిలో ఇజ్రాయెల్‌లో ఓ భారతీయుడు మరణించాడు. మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. వీరంతా కేరళకు చెందినవారు. సోమవారం ఉదయం 11 గంటల సమయంలో ఇజ్రాయెల్ ఉత్తర సరిహద్దుల్లో ఉన్న మార్గలియట్ అనే వ్యవసాయ క్షేత్రంపై ట్యాంకు విధ్వంసక క్షిపణి దాడి జరిగినట్లు అధికారులు ధ్రువీకరించారు.
మృతుడిని కేరళలోని కొల్లామ్‌కు చెందిన పట్నిబిన్ మాక్స్‌వెల్‌గా గుర్తించారు. ప్రస్తుతం అతడి మృతదేహం స్థానిక జీవ్ ఆసుపత్రిలో ఉందని అధికారులు పేర్కొన్నారు. ఈ దాడిలో గాయపడిన జోసెఫ్ జార్జ్, పాల్ మెల్విన్‌కు చికిత్స అందిస్తున్నారు. పాల్‌కు శస్త్రచికిత్స జరిగినట్లు తెలిపారు. అతడు భారత్‌లోని తన కుటుంబ సభ్యులతో మాట్లాడినట్లు చెప్పారు. ఈ దాడి హెజ్‌బొల్లా పనేనని అనుమానిస్తున్నారు. హమాస్‌కు మద్దతుగా ఈ గ్రూప్ అక్టోబర్ 8 నుంచి ఉత్తర ఇజ్రాయెల్‌లోని పలు ప్రాంతాలపై రాకెట్లు, క్షిపణులు, డ్రోన్లతో విరుచుకుపడుతోంది. దీనికి ప్రతీకారంగా హెజ్‌బొల్లా స్థావరాలపై దాడి చేసినట్లు ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ (IDF) ప్రకటించింది.