Indian Embassy Issues Advisory For Nationals In Israel :పశ్చిమాసియాలో ఉద్రిక్త పరిస్థితులు పెరుగుతున్న నేపథ్యంలో ఇజ్రాయెల్‌లో ఉన్న భారతీయ పౌరులు చాలా అప్రమత్తంగా ఉండాలని మన రాయబార కార్యాలయం తాజాగా అడ్వైజరీ జారీ చేసింది. కచ్చితంగా భద్రతా నియమాలను పాటించాలని సూచించింది.
పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో పలు భారతీయ విమానయాన సంస్థలు తమ సర్వీసులను రద్దు చేస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఇజ్రాయెల్‌లో ఉన్న భారతీయ పౌరులకు మన రాయబార కార్యాలయం తాజా అడ్వైజరీ జారీ చేసింది. అప్రమత్తంగా ఉంటూ భద్రతా నియమాలను పాటించాలని సూచించింది. భారత పౌరుల ప్రయాణాలకు సంబంధించి లెబనాన్‌లోని భారత రాయబార కార్యాలయం అడ్వైజరీ జారీచేసిన మరుసటి రోజు ఇజ్రాయెల్‌లోని కార్యాలయం మన పౌరులను అప్రమత్తం చేసింది.
‘‘ఇజ్రాయెల్‌లో ఉన్న భారతీయ పౌరులు జాగ్రత్తగా వ్యవహరించండి. దేశంలో అనవసరమైన ప్రయాణాలకు దూరంగా ఉండండి. సురక్షిత ప్రదేశాలకు దగ్గర్లో ఉండండి. పరిస్థితులను ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నాం. మన దేశ పౌరుల భద్రతకు సంబంధించి ఇజ్రాయెల్ అధికారులతో ఎప్పటికప్పుడు సంప్రదింపులు చేస్తున్నాం’’ అని ఇజ్రాయెల్‌లోని భారత రాయబార కార్యాలయం వెల్లడించింది. ఇంగ్లీష్, హిందీ, తెలుగు, కన్నడ భాషల్లోనూ అడ్వైజరీ జారీ చేసింది. అత్యవసర పరిస్థితుల్లో సంప్రదించాల్సిన నంబర్లను పోస్టు చేసింది.