తెలంగాణ

telangana

ETV Bharat / international

ట్రూడో చర్యలపై మండిపడ్డ భారత్‌- కెనడా దౌత్యవేత్తకు సమన్లు

ఖలిస్థానీ ఉగ్రవాది హర్‌దీప్‌సింగ్ నిజ్జర్ హత్య కేసులో అనుమానితులుగా భారత దౌత్యవేత్తలు - తీవ్రంగా ఖండించిన ఇండియా

By ETV Bharat Telugu Team

Published : 5 hours ago

India slams Canada
India slams Canada (ANI)

India slams Canada: ఖలిస్థానీ ఉగ్రవాది హర్‌దీప్‌సింగ్ నిజ్జర్ హత్య కేసులో హైకమిషనర్ సంజయ్ కుమార్ వర్మతో పాటు ఇతర దౌత్యవేత్తలను అనుమానితులుగా కెనడా పేర్కొనడంపై భారత్‌ తీవ్రంగా స్పందించింది. అవి అసంబద్ధ చర్యలుగా మండిపడింది. ఈ క్రమంలో ఆ దేశ ప్రధాని జస్టిన్‌ ట్రూడో చర్యలను వ్యతిరేకిస్తూ భారత్‌లోని కెనడా దౌత్యవేత్తకు తాజాగా సమన్లు జారీ చేసింది.

ఓటు బ్యాంకు రాజకీయాల కోసమే
ఖలిస్థానీ ఉగ్రవాది హర్‌దీప్‌సింగ్ నిజ్జర్‌ హత్యతో భారత్‌, కెనడా మధ్య దౌత్య సంబంధాలు క్షీణించాయి. తాజాగా నిజ్జర్‌ హత్య కేసు దర్యాప్తులో భాగంగా భారత్‌ హైకమిషనర్‌ సహా పలువురు దౌత్యవేత్తలను అనుమానితులుగా పేర్కొంటూ కెనడా ప్రభుత్వం భారత విదేశాంగ శాఖకు సమాచారం అందించింది. ఈ ఆరోపణలపై భారత్‌ తీవ్రంగా స్పందించింది. ఇవి పూర్తి అసంబద్ధమైనవని పేర్కొంది. ఓటు బ్యాంకు రాజకీయాల కోసం ట్రూడో ప్రభుత్వం ఇదంతా చేస్తోందని ఆరోపించింది. తన భూభాగంపై ఖలిస్థానీ ఉగ్రవాదాన్ని అణచివేయలేక కెనడా అర్థరహితమైన వాదనలు చేస్తోందని మండిపడింది.

2023లో ఆ దేశ ప్రధాని ట్రూడో ఆరోపణలు చేసిన నాటి నుంచి వాటికి సంబంధించి ఎటువంటి ఆధారాలను భారత్‌తో కెనడా పంచుకోలేదని విదేశాంగశాఖ వెల్లడించింది. ఇప్పటికే తాము పలు మార్లు ఆ దేశ సర్కారును అభ్యర్థించామని వెల్లడించింది. రాజకీయ లబ్ధికోసమే తాజాగా ఎటువంటి ఆధారాలు లేకుండా భారత్‌పై కెనడా విమర్శలు చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేసింది. కెనడా ప్రధాని ట్రూడో 2018 నుంచే భారత్​తో ఘర్షణాత్మక వైఖరిని అవలంభిస్తున్నట్లు ఆధారాలున్నాయని పేర్కొంది. భారత్​లో వేర్పాటువాదాన్ని ఎగదోసేవారిని ఆయన తన మంత్రి వర్గంలో చేర్చుకున్నారని గుర్తు చేసింది. 2020లో భారత రాజకీయాల్లో ట్రూడో నేరుగా జోక్యం చేసుకొనే యత్నం చేశారని ఆరోపించింది. భారత హైకమిషనర్‌ సంజయ్‌ కుమార్‌ వర్మకు 36 ఏళ్ల దౌత్య అనుభవం ఉందని విదేశాంగశాఖ వెల్లడించింది.

ఆసియాన్‌ సమావేశాల సందర్భంగా లావోస్‌లో భారత ప్రధాని మోదీ, కెనడా ప్రధాని ట్రూడో భేటీ అయినట్లుగా తెలుస్తోంది. అయితే ఇరువురి మధ్య ఎటువంటి చర్చలు జరగలేదని భారత్‌ స్పష్టంచేసింది. కేవలం వారిద్దరూ ఎదురుపడ్డారని భారత్ అధికారులు తెలిపారు. భారత వ్యతిరేక కార్యకలాపాలపై కెనడా ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకునే వరకు ఇరుదేశాల మధ్య దౌత్య సంబంధాలు సాధారణస్థితికి చేరుకోవడం కష్టమని ఇటీవలే భారత్‌ పేర్కొంది.

ABOUT THE AUTHOR

...view details