తెలంగాణ

telangana

ETV Bharat / international

తుపాకీ కేసులో దోషిగా బైడెన్ కుమారుడు- క్షమాభిక్ష కోరనని అమెరికా అధ్యక్షుడు క్లారిటీ - Hunter Biden Convicted

Hunter Biden Case : తుపాకీ కొనుగోలు సందర్భంగా తప్పుడు సమాచారం ఇచ్చిన కేసులో అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ కుమారుడు హంటర్‌ బైడెన్‌ దోషిగా తేలారు. మరోవైపు, తీర్పును అంగీకరిస్తున్నానని బైడెన్‌ ప్రకటించారు. ఈ కేసులో తాను కుమారుడి తరఫున క్షమాభిక్ష కోరబోనని స్పష్టం చేశారు.

Hunter Biden Case
Hunter Biden Case (IANS)

By ETV Bharat Telugu Team

Published : Jun 12, 2024, 7:27 AM IST

Hunter Biden Case : అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ కుమారుడు హంటర్‌ బైడెన్‌ తుపాకీ కొనుగోలు సందర్భంగా తప్పుడు సమాచారం ఇచ్చిన కేసులో దోషిగా తేలారు. ఆయనపై మోపిన మూడు అభియోగాల్లోనూ నేర నిర్ధరణ జరిగింది. మంగళవారం డెలావెర్‌లోని విల్మింగ్టన్‌ కోర్టు జడ్జి మేరీ ఎల్లెన్‌ నోరీకా హంటర్‌ నేరాన్ని నిర్ధరించారు. అయితే శిక్షా కాలాన్ని వెల్లడించలేదు. వాస్తవానికి ఇటువంటి కేసుల్లో 25 ఏళ్ల వరకు కూడా జైలు శిక్ష పడుతుంది. అయితే తొలిసారి నేరానికి పాల్పడినందున అంత కాలం శిక్ష పడకపోవచ్చని అంటున్నారు.

ఇక హంటర్ బైడెన్ నేరాన్ని నిర్ధరించిన జడ్జి ఎంత కాలం శిక్ష వేయనున్నారనేది వెల్లడించలేదు. ఎప్పటి నుంచి శిక్షను అమలు చేసేది కూడా చెప్పలేదు. తీర్పు వెలువరించిన వెంటనే హంటర్‌ భావోద్వేగానికి గురయ్యారు. అక్కడే ఉన్న తన న్యాయవాదితోపాటు సతీమణి మెలిస్సా వద్దకు వచ్చి కౌగిలించుకున్నారు. విచారణ సందర్భంగా బైడెన్‌ సతీమణి, హంటర్‌ తల్లి జిల్‌ బైడెన్‌ కోర్టుకు వచ్చారు. తీర్పు వెలువరించిన తర్వాత భార్య, తల్లితో కలిసి హంటర్‌ కోర్టు నుంచి వెళ్లిపోయారు. మీడియాతో మాట్లాడలేదు.

తీర్పును అంగీకరిస్తున్నా!
మరోవైపు కుమారుడి కేసులోతీర్పును అంగీకరిస్తున్నానని అధ్యక్షుడు జో బైడెన్‌ ప్రకటించారు. ఈ కేసులో తాను కుమారుడి తరఫున క్షమాభిక్ష కోరబోనని స్పష్టం చేశారు.

కేసు ఏంటంటే?
2018లో తుపాకీ కొనుగోలు సందర్భంగా ఆయుధ డీలరుకు ఇచ్చిన దరఖాస్తు ఫారంలో హంటర్‌ తప్పుడు సమాచారం ఇచ్చారు. తాను అక్రమంగా డ్రగ్స్‌ కొనుగోలు చేయలేదని, వాటికి బానిస కాలేదని, తనవద్ద అక్రమంగా ఆయుధం లేదని వెల్లడించారు. అయితే అది తప్పని తేలింది. అప్పటికే హంటర్‌ డ్రగ్స్‌ అక్రమంగా కొనుగోలు చేశారు. వాటికి బానిసగా మారారు. 11 రోజుల పాటు అక్రమంగా ఆయుధం కలిగి ఉన్నారు. అయితే హంటర్‌పై మరో కేసు కూడా ఉంది. కాలిఫోర్నియాలో 1.4 మిలియన్‌ డాలర్ల పన్ను ఎగవేత కేసులో ఆయన విచారణను ఎదుర్కొంటున్నారు. కాలిఫోర్నియా కోర్టులో సెప్టెంబరులో ఇది విచారణకు రానుంది.

ABOUT THE AUTHOR

...view details