Israel Attack On Gaza :ప్రధాని బెంజమిన్ నెతన్యాహు ఇళ్లే లక్ష్యంగా డ్రోన్ దాడి జరిగిన నేపథ్యంలో గాజా పౌరులపై ఇజ్రాయెల్ తీవ్రంగా విరుచుకుపడింది. ఉత్తర గాజాపై జరిపిన ఐడీఎఫ్ వైమానిక దాడుల్లో దాదాపు 87 మంది మృతిచెందినట్లు లేదా తప్పిపోయి ఉంటారని గాజా ఆరోగ్య శాఖ తెలిపింది. మరో 40మంది గాయపడినట్లు వెల్లడించింది. మరోవైపు ఇరాన్ జరిపిన క్షిపణి దాడులకు ప్రతీకారంగా ఇజ్రాయెల్ సైనిక సన్నహాలు చేస్తున్నట్లు సమాచారం.
ఉత్తర గాజాలో బీట్ లాహియా పట్టణంపై ఇజ్రాయెల్ వైమానికి దాడులకు దిగినట్లు హమాస్ వార్త సంస్థ వెల్లడిచింది. ఈ ఘటనలో మొత్తం 87 మంది మరణించినట్లు అధికారులు తెలిపారు. మృతుల్లో అనేక మంది మహిళలు, చిన్నారులే ఉన్నారు. దాడుల్లో పలువురు తీవ్రంగా గాయపడగా కొందరు శిథిలాల కిందే చిక్కుకుపోయారని అధికారులు వెల్లడించారు. మరోవైపు గాజాలోకి ఔషధాలు, ఆహారంతో నిండిన మానవతాట్రక్కులు చేరకుండా ఇజ్రాయెల్ దళాలు అడ్డుకుంటున్నట్లు అంతర్జాతీయ మీడియా తెలిపింది. పౌర నివాసాలే లక్ష్యంగా దాడులు చేయడమే కాకుండా ఆస్పత్రులను కూడా ముట్టడిస్తున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. ఉత్తర గాజాలోని ఆస్పత్రుల్లో వైద్య సామగ్రి, మానవ వనరుల కొరత అధికంగా ఉందని గాజా ఆరోగ్య శాఖ వెల్లడించింది. అటు లెబనాన్‌లోని హెజ్‌బొల్లా స్థావరాలపై ఇజ్రాయెల్ విమానాలు గర్జించాయి. లెబనాన్ నుంచి 180 క్షిపణులు, డ్రోన్లు దూసుకొచ్చిన వేళ బీరుట్‌లోని దహియేహ్ ప్రాంతంపై ఐడీఎఫ్ బాంబులు కురిపించింది. ఈ ఘటనల్లో పలువురు మృతిచెందినట్లు సమాచారం.