Hinduja Servants Case : భారతీయ మూలాలున్న సంపన్న హిందుజా గ్రూప్ కుటుంబసభ్యుల్లో నలుగురికి స్విట్జర్లాండ్‌లోని జెనీవా కోర్టు జైలు శిక్ష విధించింది. ఇంటి పనివారికి తక్కువ వేతనాలు ఇవ్వడం, వేధింపులకు గురిచేశారనే ఆరోపణలపై విచారణ జరిపిన న్యాయస్థానం తీర్పును వెలువరించింది. ప్రకాశ్ హిందుజా, ఆయన భార్య కమల, కుమారుడు అజయ్, కోడలు నమ్రతకు నాలుగు నుంచి నాలుగున్నర ఏళ్లపాటు జైలు శిక్షను ఖరారు చేసింది. అదేవిధంగా కుటుంబ వ్యాపార నిర్వాహకుడు నజీబ్ జియాజీకి న్యాయస్థానం 18 నెలల సస్పెండెడ్ శిక్ష విధించింది. ఈ కేసులో మానవ అక్రమ రవాణాకు పాల్పడుతున్నారనే తీవ్రమైన నేరారోపణలను జెనీవా కోర్టు తోసిపుచ్చింది.
పనివాళ్ల కంటే పెంపుడు కుక్కకే ఎక్కువ
నిరక్షరాస్యులైన భారతీయులను తీసుకొచ్చి జెనీవాలోని తమ విలాసవంతమైన విల్లాలో సేవకులుగా నియమించుకున్నారని, వారి పాస్‌పోర్టులను ప్రకాశ్ హిందుజా కుటుంబం తీసేసుకుందని ప్రాసిక్యూషన్ ఆరోపించింది. వేతనాలను స్విస్ కరెన్సీలో కాకుండా రూపాయల్లో చెల్లుస్తున్నారని, అదీ కూడా సేవకుల చేతికి ఇవ్వకుండా భారత్‌లోని వారి బ్యాంకు ఖాతాల్లో జమచేస్తున్నారని తెలిపింది. రోజుకు 15-18 గంటలకుపైగా పనిచేయించుకోవడం, తగు విశ్రాంత సమయాన్ని ఇవ్వకపోడం, విల్లాని వదిలి వెళ్లటానికి అనుమతించకపోవడం వంటి నేరారోపణలు మోపింది. 18 గంటలు పనిచేస్తే 6.19 పౌండ్ల (652 రూపాయలు) కంటే తక్కువ చెల్లిస్తున్నారని, ఇంట్లో ఉండే పెంపుడు శునకానికి మాత్రం ఏడాదికి 7615 (సుమారు 8లక్షలు) పౌండ్లు ఖర్చు చేస్తున్నారని తెలిపింది. స్విట్జర్లాండ్ చట్టాలను ఉల్లంఘించారని, ఆ కుటుంబంలో నలుగురిపై చర్యులు తీసుకోవాలని ప్రాసిక్యూషన్ కోరింది. కేసును విచారించిన జెనీవా కోర్టు ఈ మేరకు తీర్పు వెలువరించింది.