Hamas Commander Death : హెజ్‌బొల్లా లక్ష్యంగా లెబనాన్‌పై ఇజ్రాయెల్ చేస్తున్న భీకర దాడులు ఇంకా కొనసాగుతున్నాయి. ఉత్తర లెబనాన్‌పై తాజాగా జరిపిన వైమానిక దాడుల్లో హమాస్ కీలక నేత సయీద్ అతల్లా, ఆయన కుటుంబ సభ్యులు మృతి చెందినట్లు సమాచారం.
ఉత్తర లెబనాన్ ట్రీపోలిలోని పాలస్తీనా శరణార్థుల శిబిరంపై ఇజ్రాయెల్ వైమానిక దాడులకు దిగింది. ఈ దాడుల్లో హమాస్‌కు చెందిన అల్ ఖసమ్ బ్రిగేడ్ సాయుధ విభాగంలో సభ్యుడైన సయీద్ అతల్లా హతమైనట్లు సమాచారం. ఆయనతో పాటు ముగ్గురు కుటుంబ సభ్యులు కూడా మరణించినట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని హమాస్‌కు చెందిన కొన్ని మీడియా వర్గాలు పేర్కొన్నాయి. ఇదే విషయాన్ని అటు ఇజ్రాయెల్ వార్త సంస్థలు సైతం ప్రచురించాయి.
ఇక, లెబనాన్‌పై ఇజ్రాయెల్ జరిపిన దాడుల్లో ఇప్పటివరకు రెండు వేల మందికిపైగా ప్రాణాలు కోల్పోయినట్లు పలు మీడియా కథనాలు వెలువడ్డాయి. అందులో 250 మంది హెజ్‌బొల్లా సభ్యులు ఉన్నట్లు సమాచారం.
మూడు నెలల క్రితమే గాజాపై తాము జరిపిన దాడుల్లో హమాస్ తరఫున అప్రకటిత ప్రధానిగా వ్యవహరించిన రావీ ముష్తాహా మృతి చెందినట్లు ఇటీవల ఇజ్రాయెల్ భద్రతా దళాలు ప్రకటించాయి. ముష్తాహాను లక్ష్యంగా చేసుకొని ఐడీఎఫ్ దళాలు దాడిలో హమాస్ పొలిటికల్ బ్యూరో సీనియర్‌నాయకుడు సమీ అల్ సిరాజ్, జనరల్ సెక్యూరిటీ చీఫ్ సమి ఒదేహ్ చనిపోయినట్లు ఐడీఫ్ ధ్రువీకరించింది. వీరంతా సొరంగాల్లో నక్కిన సమయంలో ఇజ్రాయెల్ దళాలకు కచ్చితమైన సమాచారం లభించింది. దీంతో ఫైటర్ జెట్ల సాయంతో ఈ ఆపరేషన్ నిర్వహించాయి. మరోవైపు హమాస్ మాత్రం వీరి మరణాలను ధ్రువీకరించలేదు. దీంతో ఆ మిలిటెంట్ సంస్థ కేడర్ నైతిక స్థైర్యం దెబ్బతినకుండా నష్టాలను దాస్తోందని ఇజ్రాయెల్ భావిస్తోంది.
ఇటీవల బీరుట్‌లో ఇజ్రాయెల్ జరిపిన దాడుల్లో హెజ్‌బొల్లా చీఫ్ హసన్ నస్రల్లా మరణించారు. దీంతో ఇజ్రాయెల్‌పై ఇరాన్ ప్రతీకారంగా 180 క్షిపణులతో విరుచుకుపడింది. ఇజ్రాయెల్ కూడా ప్రతీకార దాడులకు సిద్ధమవుతున్న నేపథ్యంలో పశ్చిమాసియాలో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి.