Attacks On US Presidents And Candidates :అమెరికాలో రాజకీయ హింసకు సంబంధించిన ఘటనలు జరగటం ఇదే మొదటిసారి కాదు. అగ్రరాజ్యం అధ్యక్షుడు అబ్రహం లింకన్ నుంచి మాజీ అధ్యక్షుడు ట్రంప్ వరకు పలువురు ఈ దాడుల బారినపడ్డారు. అగ్రరాజ్యంలో రాజకీయ హింసకు తొలిసారిగా అమెరికా 16వ అధ్యక్షుడు అబ్రహం లింకన్ బలయ్యారు. 1865 ఏప్రిల్ 14న వాషింగ్టన్‌లోని ఫోర్డ్స్ థియేటర్‌లో భార్యతో కలిసి ఓ షోకు హాజరైన లింకన్‌పై, జాన్ విల్కెస్ బూత్ అనే దుండగుడు కాల్పులు జరిపాడు. తలవెనక భాగంలో తీవ్రగాయంతో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ అబ్రహం లింకన్ ప్రాణాలు కోల్పోయారు. నల్ల జాతీయుల హక్కులకు మద్దతు ఇవ్వడమే లింకన్ హత్యకు కారణంగా తేలింది.
బాధ్యతలు స్వీకరించిన 6 నెలల్లోనే!
అమెరికా 20వ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన 6 నెలల్లోనే గార్ఫీల్డ్ హత్యకు గురయ్యారు. 1881 జులై 2న న్యూ ఇంగ్లాండ్ వెళ్లేందుకు వాషింగ్టన్‌లోని ఓ రైల్వే స్టేషన్‌లో రైలు కోసం నడుస్తున్న సమయంలో చార్లెస్ గిటౌ అనే దుండగుడు ఆయనపై కాల్పులు జరిపాడు. తీవ్రంగా గాయపడిన గార్ఫీల్డ్, వైట్‌హౌస్‌లో చికిత్స పొందుతూ కన్నుమూశారు.
ప్రజలతో కరచాలనం చేస్తున్న సమయంలో!
1901 సెప్టెంబర్ 6న ప్రసంగం అనంతరం అమెరికా 25వ అధ్యక్షుడు విలియం మెక్‌కిన్లే ప్రజలతో కరచాలనం చేస్తున్న సమయంలో కాల్పులు జరిగాయి. పాయింట్ బ్లాంక్ రేంజ్‌లో హంతకుడు కాల్పులు జరపగా 2 బుల్లెట్లు మెక్‌కిన్లే ఛాతీలోకి చొచ్చుకుపోయాయి. వారం రోజులపాటు మృత్యువుతో పోరాడిన మెక్‌కిన్లే తుదిశ్వాస విడిచారు. రెండోసారి అధికారం చేపట్టిన ఆరునెలల్లోనే ఆయనపై దాడి జరిగింది.
1933లో అమెరికా 32వ అధ్యక్షుడు ఫ్రాంక్లిన్ డి. రూజ్‌వెల్ట్ ప్రెసిడెంట్ ఎలక్ట్‌గా ఉన్న సమయంలో ఆయన ఉన్న ఓపెన్ కారుపై కాల్పులు జరిగాయి. ఈ ఘటనలో రూజ్‌వెల్ట్‌కు గాయాలేమీ కాలేదు. అయితే చికాగో మేయర్ అంటోన్ సెర్మాక్ మరణించారు. అమెరికా 33వ అధ్యక్షుడు హ్యారీ S. ట్రూమాన్ 1950లో వైట్ హౌస్‌కి ఎదురుగా బ్లెయిర్ హౌస్‌లో ఉంటున్న సమయంలో ఇద్దరు ముష్కరులు లోపలికి ప్రవేశించి కాల్పులు జరిపారు. ఈ ఘటనలో ట్రూమాన్ గాయపడలేదు, కానీ వైట్‌హౌస్ పోలీసు, దుండగుల్లో ఒకరు మరణించారు.