French Government Collapse : ఫ్రాన్స్‌లో కీలక పరిణామం జరిగింది. మితవాద, అతివాద చట్టసభ సభ్యులు ఒక్కటై అవిశ్వాస తీర్మానంలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటు వేశారు. ఈ ఘటనతో ప్రధాని మిచెల్ బార్నియర్ తన పదవిని కోల్పోయారు. దేశంలో రాజకీయ సంక్షోభం ఏర్పడింది. ఫ్రాన్స్ చరిత్రలో 1962 తర్వాత అవిశ్వాస తీర్మానంతో పదవి నుంచి వైదొలగనున్న తొలి ప్రధానిగా బార్నియర్ నిలవనున్నారు. ఆయన ప్రధానిగా మూడు నెలలు మాత్రమే ఉన్నారు. అత్యంత తక్కువ కాలం ప్రధానిగా పనిచేసిన వ్యక్తిగానూ మిచెల్ నిలిచారు.
అవిశ్వాస తీర్మానంలో ఓడిన ఫ్రాన్స్ ప్రధాని - 1962 తర్వాత ఇదే మొదటిసారి - FRENCH GOVERNMENT
ఫ్రాన్స్ జాతీయ అసెంబ్లీలో ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానంలో ఓడిపోయిన ప్రధాని బార్నియర్
Published : Dec 5, 2024, 6:55 AM IST
ప్రభుత్వానికి వ్యతిరేకంగా 60 ఏళ్లలో జాతీయ అసెంబ్లీలో అవిశ్వాస తీర్మానం నెగ్గడం ఇదే తొలిసారి. ఫ్రాన్స్ జాతీయ అసెంబ్లీలో మొత్తం 577 ఓట్లు ఉండగా ప్రధానికి వ్యతిరేకంగా 331 ఓట్లు పడ్డాయి. అవిశ్వాస తీర్మానాన్ని తొలుత మితవాద సభ్యులు ప్రవేశపెట్టగా మారైన్ లె పెన్ నేతృత్వంలోని ఫార్ రైట్ నేషనల్ ర్యాలీ మద్దతు ఇచ్చింది. ప్రధాని మిచెల్‌కు వ్యతిరేకంగా భారీగా ఓట్లు పడ్డాయి. దీంతో బార్నియర్, ఫ్రాన్స్ అధ్యక్షుడు మెక్రాన్‌ను కలిసి తన రాజీనామా సమర్పించనున్నారు.
గత జులైలోనే అధ్యక్షుడు మెక్రాన్ ప్రధానిగా బార్నియర్‌ను నియమించారు. మూడు నెలలకే ఆయన పదవిని కోల్పోవాల్సిన పరిస్థితి నెలకొంది. అంతకుముందు 34 ఏళ్ల గాబ్రియేల్ అట్టల్ జులైలో ప్రధాని పదవి నుంచి వైదొలిగారు. దీంతో ఈ ఏడాదిలోనే మూడోసారి ప్రధానిని నియమించడం మెక్రాన్‌కు సవాల్‌గా మారనుంది. అధ్యక్షుడు మెక్రాన్ 2027 వరకు పదవిలో కొనసాగనున్నారు.