Corruption Case Imran Khan :పాకిస్థాన్ మాజీ ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్‌కు మరో భారీ షాక్ తగిలింది. అల్ ఖాదిర్ యూనివర్సిటీ ట్రస్ట్ ప్రాజెక్టుకు సంబంధించిన రూ.2వేల కోట్ల కుంభకోణం కేసును విచారించిన కోర్టు- శుక్రవారం సంచలన తీర్పును వెలువరించింది. ఇమ్రాన్ ఖాన్, ఆయన సతీమణి బుష్రా బీబీలను దోషులుగా తేల్చింది. ఇమ్రాన్‌కు 14 ఏళ్ల జైలుశిక్ష, రూ.3 లక్షల జరిమానా విధించింది. బుష్రా బీబీకి ఏడేళ్ల జైలుశిక్ష, రూ.1.50 లక్షల జరిమానాను విధిస్తూ కోర్టు తీర్పు ఇచ్చింది. ఈ మేరకు ఇస్లామాబాద్‌లోని యాంటీ కరప్షన్ ప్రత్యేక కోర్టుకు చెందిన న్యాయమూర్తి జస్టిస్ నాసిర్ జావెద్ రాణా తీర్పు ఇచ్చారు.
గతంలో వివిధ కారణాలతో ఈ అవినీతి కేసులో తీర్పు ఇవ్వడం మూడుసార్లు వాయిదా పడింది. చివరిసారిగా జనవరి 13న తీర్పు వెలువరించడాన్ని వాయిదా వేయాల్సి వచ్చింది. ఈ నేపథ్యంలో రావల్పిండిలో ఉన్న అదియాలా సెంట్రల్ జైలులో తాత్కాలిక కోర్టును ఏర్పాటు చేశారు. అక్కడి నుంచే తీర్పును న్యాయమూర్తి జస్టిస్ నాసిర్ జావెద్ రాణా ఇచ్చారు. కాగా, ఇతరత్రా కేసుల్లో శిక్ష పడటం వల్ల ఇమ్రాన్ ఖాన్ ఇప్పటికే జైలులో ఉన్నారు. తీర్పును వెలువరించిన వెంటనే కోర్టులోనే బుష్రా బీబీని అరెస్టు చేశారు.