Fire Accident In Dormitory In China :చైనాలోని ఓ పాఠశాల వసతి గృహంలో మంటల చెలరేగి 13 మంది మృతిచెందగా ఓ వ్యక్తి గాయపడ్డాడు. ఈ ఘటన హెనాన్ ప్రావిన్స్‌లో యన్షాన్పు గ్రామంలో జరిగింది. ఈ ప్రమాదంపై సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. ఈ ప్రమాదంపై స్థానిక అధికారులు దర్యాప్తు చేపట్టారు.
చైనా వార్తా సంస్థల కథనాల ప్రకారం శుక్రవారం రాత్రి 11 గంటల సమయంలో అగ్నిప్రమాదం సంభవించింది. అగ్నిమాపక దళాలు వెంటనే రంగంలోకి దిగాయని, 11.38 గంటల సమయానికి మంటలను పూర్తిగా ఆర్పేశాయని చైనా మీడియా వెల్లడించింది. గాయపడ్డ వ్యక్తి ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నట్లు తెలిపింది. ఆ వ్యక్తి పరిస్థితి నిలకడగా ఉందని స్పష్టం చేసింది. మూడో తరగతి విద్యార్థులేనని స్థానిక వార్తా సంస్థతో ఆ స్కూల్ టీచర్ తెలిపారు.
కిండర్‌గార్డెన్ పిల్లలే!
ప్రమాదానికి గల కారణాలపై అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. ఘటనకు సంబంధం ఉందని భావిస్తున్న ఒకరిని అదుపులోకి తీసుకున్నారు. కాగా, స్కూల్ గురించిన వివరాలేవీ అధికారంకంగా బయటకు రాలేదు. అయితే, సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోల్లో కిండర్‌గార్డెన్ స్థాయి పిల్లలు ముఖాలకు మాస్క్ ధరించడం కనిపిస్తోంది. క్యాలీగ్రఫీ నేర్చుకునే విద్యార్థులు సైతం ఇక్కడ ఉంటున్నట్లు తెలుస్తోంది. ఈ ఘటనపై చైనాలో తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇలాంటి ప్రమాదాలు జరగకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని నెటిజన్లు డిమాండ్ చేస్తున్నారు. ప్రమాదానికి కారకులైన వారిని కఠినంగా శిక్షించాలని కోరుతున్నారు.