Donald Trump Reaction: మృత్యువు నుంచి దేవుడే తనను రక్షించాడని అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అన్నారు. త్రుటిలో మృత్యువు నుంచి బయటపడ్డానని పేర్కొన్నారు. ఇలాంటి సమయాల్లోనే మనమంతా ఐక్యంగా నిలబడాలని పిలుపునిచ్చారు. 'అమెరికన్లుగా మన నిజమైన పాత్రను చూపించడం, బలంగా, దృఢంగా ఉండి, చెడు గెలవడానికి అనుమతించకపోవడం చాలా ముఖ్యం" అని ట్రంప్ చెప్పారు. అంతేకాకుండా తాము భయపడబోమని అన్నారు. మరోవైపు, హత్యాయత్నం ఘటన తర్వాత ట్రంప్ బాగానే ఉన్నారని ఆయన ప్రచార ప్రతినిధి ఒకరు తెలిపారు.
దేశాధినేతల స్పందన
ఏ రూపంలోని రాజకీయ హింసకైన మన సమాజంలో స్థానం లేదని బ్రిటిష్ ప్రధాని కీర్ స్టార్మర్ అన్నారు. ఈ ఘటన ప్రజాస్వామ్యాలకే విషాదకరమని ఫ్రెంచ్‌ధ్యక్షుడు మాక్రాన్ చెప్పారు. ఇది క్షమించరాని దాడి అని ఆస్ట్రేలియా ప్రధాని అల్బనీస్ అన్నారు. చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ ట్రంప్‌కు సానుభూతి ప్రకటించారు. పెన్సిల్వేనియా ఘటనను నేర, తీవ్రవాద చర్యగా యుఏఈ అభివర్ణించింది. అంతకుముందు, తన స్నేహితుడు ట్రంప్‌పై దాడిని తీవ్రంగా ఖండిస్తున్నట్లు తెలిపిన ప్రధాని మోదీ ఆయన త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నట్లు చెప్పారు. ప్రజాస్వామ్యం, రాజకీయాల్లో హింసకు తావులేదన్నారు.
ఇదిలా ఉండగా, ఈ ఘటనపై రష్యా అమెరికాకు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చింది. హత్యాయత్నాన్ని బైడెన్ ప్రభుత్వం ప్రోత్సహించిందని అనుకోవడం లేదని రష్యా తెలిపింది. ఉక్రెయిన్‌కు ఆయుధాలు ఇచ్చే బదులు ఆ డబ్బును అమెరికా శాంతిభద్రతలకు వినియోగించాలని పేర్కొంది.
ట్రంప్ ఫొటోలతో టీ షర్టులు
ఈ ఘటన జరిగిన కొన్ని గంటల్లోనూ చైనాలో ట్రంప్ ఫొటోలతో కూడా టీ షర్టులు వెల్లువెత్తాయి. ప్రమాద సమయంలో ట్రంప్ చేసిన ఫైట్ ఫైట్ అంటూ నినాదాలు చేశారు. దీనికి సంబంధించిన ఫొటోలతోనే చైనాలోని వ్యాపారులు టీ- షర్టులను రూపొందించడం మొదలుపెట్టారు. మొదటగా చైనాలో ఈ కామర్స్ వేదిక తొబావు (అలీబాబా)లో ఈ టీ షర్టలు ప్రత్యక్షమయ్యాయి. కేవలం మూడు గంటల వ్యవధిలో 2 వేలకు పైగా ఆర్డర్లు వచ్చాయని ఓ మహిళా వ్యాపారి పేర్కొన్నారు. డిజిటల్ ప్రింటింగ్ టెక్నాలజీని ఉపయోగించి వీటిని రూపొందించినట్లు తయారీదారులు పేర్కొన్నారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఇవి వైరల్‌గా మారాయి.
హైబీ ప్రావిన్సులో ఉన్న ఫ్యాక్టరీలో వీటికి సంబంధించి అనేక ఉత్పత్తులు సిద్ధం చేస్తున్నట్లు తయారీదారులు పేర్కొన్నారు. ఫొటోలను డౌన్లౌడ్ చేసుకొని క్షణాల్లో వాటిని ప్రింట్ చేస్తున్నామని ఓ చైనా వ్యాపారి పేర్కొన్నారు. అతనికి ఎన్నికల్లో గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని, చైనీయుల్లోనూ ఆయన ఎంతో పాపులర్ అన్నారు.