Donald Trump On Hindu Voters : అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఇండో-అమెరికన్ ఓటర్లు కీలకంగా మారారు. ఈసారి మునుపెన్నడూ లేని విధంగా రిపబ్లికన్, డెమోక్రటిక్ పార్టీల మధ్య హోరాహోరీ పోటీ నెలకొనటం వల్ల అభ్యర్థులిద్దరూ ఆ వర్గం ఓట్లను ఆకర్షించేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. దీపావళి పండుగను పురస్కరించుకొని శుభాకాంక్షలు తెలిపిన రిపబ్లికన్ పార్టీ అధ్యక్ష అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ ఇటీవల బంగ్లాదేశ్‌లో హిందువులు, క్రిష్టియన్లు, ఇతర అల్పసంఖ్యాకులపై జరిగినదాడిని తీవ్రంగా ఖండించారు. తన హయాంలో ఎప్పుడూ ఇలా జరగలేదన్నారు. అమెరికా అధ్యక్షుడు బైడెన్, డెమోక్రటిక్ పార్టీ అధ్యక్ష అభ్యర్థి కమలా హారిస్ అమెరికాతోపాటు ప్రపంచంలోని హిందువులను పట్టించుకోలేదని ట్రంప్ విమర్శించారు. అమెరికా, బంగ్లాదేశ్‌తోపాటు ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిందువుల హక్కులను పరిరక్షిస్తానని హామీ ఇచ్చారు. రాడికల్ లెఫ్ట్ నుంచి ఎదురవుతున్న మత వ్యతిరేక అజెండా నుంచి హిందువులను రక్షిస్తానని ట్రంప్ తెలిపారు. అధ్యక్ష ఎన్నికల్లో గెలిస్తే భారత్-అమెరికా సంబంధాలను మరింత పటిష్ఠం చేస్తానని హామీఇచ్చారు ట్రంప్ ప్రకటనపై హిందూస్ ఫర్ అమెరికా ఫస్ట్ వ్యవస్థాపకుడు, ఛైర్మన్ ఉత్సవ్ సందూజ హర్షం వ్యక్తం చేశారు. ఈ ప్రకటన చేసినందుకు ఆయనకు కృతజ్ఞతలు తెలిపారు.
"ప్రస్తుతం కమలాహారిస్‌కు 60శాతం మంది ఇండో-అమెరికన్లు మద్దతు ఇస్తున్నారు. గత ఎన్నికల్లో బైడెన్‌కు 68శాతం మంది మద్దతు ఇచ్చారు. డెమోక్రటిక్ పార్టీ అభ్యర్థికి మద్దతు క్రమంగా తగ్గుకుంటూ వస్తోంది. గత ఎన్నికల్లో ట్రంప్‌నకు 22 శాతం మంది ఇండో-అమెరికన్లు మద్దతు ఇచ్చారు. సర్వేల ప్రకారం ఇప్పుడు ఆ సంఖ్య 32శాతానికి పెరిగింది. ట్రంప్ ప్రకటన ఇండో-అమెరికన్లు, హిందు-అమెరికన్ల కళ్లు తెరిపించింది. వారంతా ఇప్పుడు ట్రంప్‌నకు ఓటు వేస్తారని అనుకుంటా."
--ఉత్సవ్ సందూజ, ఫౌండర్, ఛైర్మన్ హిందూస్ ఫర్ అమెరికా ఫస్ట్
వచ్చేవారం జరిగే ఎన్నికల్లో భారత్-అమెరికా సంబంధాలు, ఇమ్మిగ్రేషన్ సమస్య పరిష్కారం వంటి అంశాలు ప్రభావం చూపనున్నాయి. వాషింగ్టన్‌లో అధికారం చేపట్టే విషయంలో భారత్-అమెరికా సంబంధాలు పెద్దగా ప్రభావం చూపబోవనే వారు కూడా ఉన్నారు. కానీ భారత్-అమెరికా మధ్య సంబంధాలు మెరుగుపడాలని ఇండో-అమెరికన్లు అభిప్రాయపడుతున్నారు. అందుకు ట్రంప్ లేదా హారిస్ ఎవరు ప్రయత్నిస్తారనేది చూడాల్సి ఉందంటున్నారు. రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్‌నకు గతంలో ప్రధాని మోదీతో మంచి సంబంధాలు ఉండేవని, ఆయన హయాంలో ఇరుదేశాల మధ్య సంబంధాలు బాగుండేవని ఇండో-అమెరికన్ సంఘం అధ్యక్షుడు అవినాష్ గుప్తా తెలిపారు.