Donald Trump Net Worth :అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆస్తుల విలువ భారీగా పెరిగింది. బ్లూమ్‌బెర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్ విడుదల చేసిన తొలి 500 మంది సంపన్నుల జాబితాలో ఆయన స్థానం సంపాదించారు. తాజా అంచనాల ప్రకారం ట్రంప్ సంపద విలువ 4 బిలియన్ డాలర్లు (రూ.33 వేల కోట్లు) పెరిగి 6.5 బిలియన్ డాలర్లకు చేరింది. కొన్నేళ్లుగా పెండింగ్‌లో ఉన్న ఆయన కంపెనీ డీల్ ఒకటి తాజాగా పూర్తయింది. ఫలితంగా ఆయన ఆస్తుల విలువ భారీగా పెరిగింది. కాగా, గతంలో ఎన్నడూ ఆయన ఆస్తుల విలువ ఈ స్థాయిలో లేదని యూఎస్‌ఏ టుడే పేర్కొంది.
ఆరు నెలలు ట్రంప్ ఆ పని చేయకూడదు!
ట్రంప్‌నకు చెందిన సామాజిక మాధ్యమం 'ట్రూత్ సోషల్' సంస్థ డిజిటల్ వరల్డ్ అక్విజేషన్ కార్ప్(డీడబ్ల్యూఏసీ)తో విలీనం ప్రక్రియ పూర్తయింది. ఈ ప్రక్రియ దాదాపు 29 నెలలు కొనసాగింది. ఇక మార్కెట్లో డీడబ్ల్యూఏసీ షేర్లు ఒకేసారి 35శాతానికి పైగా ర్యాలీ చేశాయి. దీనితో ట్రంప్ సంపద కూడా భారీగా పెరిగి 6.5 బిలియన్ డాలర్లకు చేరుకున్నట్లు సీఎన్‌బీసీ పేర్కొంది. విలీనం తర్వాత ఏర్పడ్డ కొత్త కంపెనీ నేటి నుంచి నాస్‌డాక్‌లో డీజేటీ పేరుతో ట్రేడింగ్‌ను ప్రారంభించనుంది. అయితే నిబంధనల ప్రకారం ఈ కొత్త కంపెనీలోని షేర్లను ట్రంప్ కనీసం ఆరు నెలల పాటు విక్రయించకుండా ఉండాల్సి ఉంటుంది.