తెలంగాణ

telangana

ETV Bharat / international

బంగ్లాలో హిందువులపై దాడిని ఖండిస్తున్నా- భారత్​తో మంచి రిలేషన్: ట్రంప్ - TRUMP ON ATTACKING HINDUS

బంగ్లాదేశ్‌లో హిందువులపై జరిగిన దాడిని ఖండించిన ట్రంప్​- భారత్​తో బలమైన భాగస్వామ్యాన్ని ఏర్పరుచుకుంటామన్న మాజీ అధ్యక్షుడు

Trump On Attacking Hindus
Trump On Attacking Hindus (Associated Press)

By ETV Bharat Telugu Team

Published : Nov 1, 2024, 11:15 AM IST

Trump On Attacking Hindus : బంగ్లాదేశ్‌లో ఇటీవల హిందువులపై జరిగిన దాడిని రిపబ్లికన్‌ పార్టీ అధ్యక్ష అభ్యర్థి డొనాల్డ్‌ ట్రంప్‌ తీవ్రంగా ఖండించారు. తాను అధ్యక్ష ఎన్నికల్లో గెలిస్తే భారత్‌తో అమెరికా సంబంధాలను మరింత పటిష్ఠం చేస్తానని పేర్కొన్నారు. దీపావళి పండుగ నేపథ్యంలో సోషల్‌మీడియా వేదికగా ఆయన పోస్టు చేశారు. ఈ సందర్భంగా హిందువులకు ఆయన దీపావళి శుభాకాంక్షలు తెలిపారు. అమెరికా అధ్యక్షుడు బైడెన్‌, డెమొక్రటిక్‌ పార్టీ అధ్యక్ష అభ్యర్థి కమలా హారిస్‌ అమెరికాతోపాటు, ప్రపంచంలోని హిందువులను పట్టించుకోలేదని విమర్శించారు.

"బంగ్లాదేశ్‌లో హిందువులు, క్రైస్తవులతో పాటు ఇతర మైనారిటీలపై జరిగిన అనాగరిక దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాను. అల్లరి మూకలు హిందువుల ఇళ్లు, దుకాణాలను దోపిడీ చేశారు. దీంతో ఆ దేశంలో తీవ్రమైన భయానక గందరగోళ పరిస్థితులు తలెత్తాయి. నా సమయంలో ఎప్పుడూ ఇలా జరగలేదు. అమెరికాతో పాటు ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిందువులను కమలా, బైడెన్‌లు విస్మరించారు. ఇజ్రాయెల్‌ నుంచి మొదలుకొని ఉక్రెయిన్‌, అమెరికా దక్షిణ సరిహద్దు వరకు విపత్తులు ఎన్నో ఉన్నాయి. మేం అధికారంలోకి వస్తే మళ్లీ అమెరికాను బలంగా తయారు చేసి శాంతిని నెలకొల్పుతాం. రాడికల్‌ లెఫ్ట్‌ నుంచి ఎదురవుతున్న మత వ్యతిరేక ఎజెండా నుంచి హిందూ అమెరికన్లకు రక్షణ కల్పిస్తాం. హిందువుల స్వేచ్ఛ కోసం పోరాడతాం"
- డొనాల్డ్ ట్రంప్, రిపబ్లికన్‌ పార్టీ అధ్యక్ష అభ్యర్థి

"నా పరిపాలనతో ఇండియాతో పాటు నా స్నేహితుడు, ప్రధాని మోదీతో బలమైన భాగస్వామ్యాన్ని ఏర్పరుచుకుంటాం. కమలా హారిస్‌ గెలిస్తే అధిక పన్నులు, కఠినమైన నిబంధనలతో మీ చిన్న వ్యాపారాలను దెబ్బతీస్తుంది. నేను గెలిస్తే పన్నులు, నిబంధనల్లో కొత విధిస్తా. అమెరికాను చరిత్రలోనే అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా నిర్మిస్తా. ఇంతకుముందు ఎన్నడూ లేనివిధంగా అమెరికాను అత్యంత శక్తిమంతగా, ఉత్తమంగా తీర్చిదిద్దుతా. అమెరికాను మరోసారి ఉన్నతస్థాయిలో నిలబెడతా. దీపావళి పండగ చెడుపై విజయం సాధించేలా చేస్తుందని నమ్ముతున్నాను" అని ట్రంప్‌ పేర్కొన్నారు.

గతంలో అధ్యక్షుడిగా ఉన్న సమయంలో భారత్‌తో ట్రంప్‌ సానుకూలంగా వ్యవహరించారు. ట్రంప్‌, మోదీ హౌడీ మోదీ పేరుతో 2019లో టెక్సాస్‌లో, 2020లో అహ్మదాబాద్‌లో నమస్తే ట్రంప్ పేరిట భారీ సమావేశం ఏర్పాటు చేశారు. ఈ రెండు సభలకు ఇరు దేశాల నుంచి భారీ మద్దతు లభించింది. దీంతో భారతీయుల్లో ట్రంప్‌ పట్ల అభిమానం పెరిగింది. ఈ నేపథ్యంలోనే అమెరికాలో భారీ సంఖ్యలో ఉన్న ఇండో అమెరికన్లను ఆకట్టుకోవడానికి అందివచ్చిన ఏ అవకాశాన్ని వదులుకోవడం లేదు ట్రంప్. మరో ఐదు రోజుల్లో ఎన్నికలు ఉండడం వల్ల జోరుగా ప్రచారం చేస్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details