తెలంగాణ

telangana

ETV Bharat / international

ట్రంప్​న​కు బిగ్​ షాక్​- 34కేసుల్లో దోషిగా తేల్చిన కోర్టు- తొలి వ్యక్తిగా అపఖ్యాతి - Hush Money Trial

Hush Money Trial : అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ హష్ మనీ పేమెంట్స్‌ సహా 34 కేసుల్లో దోషిగా తేలారు. అగ్రరాజ్యం చరిత్రలో నేరాలకు పాల్పడిన తొలి మాజీ అధ్యక్షుడిగా ట్రంప్ అపఖ్యాతి మూటగట్టుకున్నారు.

Hush Money Trial
Hush Money Trial (Associated Press)

By ETV Bharat Telugu Team

Published : May 31, 2024, 7:03 AM IST

Updated : May 31, 2024, 8:43 AM IST

Hush Money Trial :హష్ మనీ పేమెంట్స్‌ సహా 34 కేసుల్లో అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ను న్యూయార్క్ కోర్టు దోషిగా తేల్చింది. 2016 అమెరికా అధ్యక్ష ఎన్నికలకు ముందు తప్పుడు వ్యాపార రికార్డులను చూపెట్టారని న్యాయస్థానం పేర్కొంది. దీంతో అగ్రరాజ్యం చరిత్రలో నేరాలకు పాల్పడిన తొలి మాజీ అధ్యక్షుడిగా ట్రంప్ అపఖ్యాతి మూటగట్టుకున్నారు. ట్రంప్‌ ఎదుర్కొన్న మొత్తం 34 కేసుల్లో దోషిగా నిర్ధరించే ముందు రెండు రోజుల పాటు సుమారు 9.5 గంటలు న్యాయనిపుణులు చర్చించారు.

తీర్పు వెలువరించే ముందు ట్రంప్ ముఖంలో ఎలాంటి హావభావాలు కనిపించలేదు. ట్రంప్ విరోధులు మాత్రం ఆనందంతో కేరింతలు కొట్టారు. కోర్టు బయట సంబరాలు చేసుకున్నారు. ట్రంప్‌ను దోషిగా తేల్చినా ఆయనకు ఎప్పుడు శిక్ష విధిస్తారనే అంశాన్ని కోర్టు ప్రస్తావించలేదు. ఒకవేళ ట్రంప్ జైలుకు వెళ్తే నవంబర్‌లో ఆయనకు ఓటువేసే హక్కు ఉండదని తెలుస్తోంది. కోర్టు తీర్పు అనంతరం మాట్లాడిన ట్రంప్, తాను అమాయకుడిననీ ఏ తప్పు చేయలేదని చెప్పారు. న్యాయం కోసం పోరాడతానని తెలిపారు.

అసలేంటీ ఆరోపణలు?
స్టార్మీ డేనియల్‌తో ట్రంప్‌ గతంలో ఏకాంతంగా గడిపారని ఆయనపై ఆరోపణలు ఉన్నాయి. 2016లో అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేసే సమయంలో దీనిపై ఆమె నోరు విప్పకుండా ట్రంప్‌ పెద్ద మొత్తంలో డబ్బు ముట్టజెప్పారని అభియోగాల్లో తెలిపారు. తన న్యాయవాది ద్వారా ఆమెకు సొమ్ము ఇప్పించారని చెప్పారు. ప్రచార కార్యక్రమాల కోసం అందిన విరాళాల నుంచి ఆ మొత్తాన్ని ఖర్చు చేశారని అందులో పేర్కొన్నారు. అందుకోసం బిజినెస్‌ రికార్డులన్నింటినీ తారుమారు చేశారన్నది ప్రధాన ఆరోపణ. ఇలా మొత్తం 34 అంశాల్లో ఆయనపై అభియోగాలు నమోదయ్యాయి. సుదీర్ఘ విచారణ అనంతరం అవన్నీ నిజమేనని తాజాగా న్యూయార్క్​ కోర్టు తేల్చింది. ట్రంప్‌తో అక్రమ సంబంధం నిజమేనని స్టార్మీ డేనియల్స్‌ స్వయంగా కోర్టులో వాంగ్మూలం ఇచ్చింది.

ట్రంప్​ జైలుకెళ్లాల్సిందేనా?
దోషిగా తేలడం వల్ల ట్రంప్‌ జైలుకెళ్లాల్సిందేనా అనే ప్రశ్న అందరిలో తలెత్తుతోంది. దీనికి కచ్చితమైన సమాధానం చెప్పలేమని నిపుణులు అంటున్నారు. జులై 11న ఆయనకు కోర్టు శిక్షను ఖరారు చేయనుంది. బిజినెస్‌ రికార్డులు తారుమారు చేయడమనేది న్యూయార్క్‌లో తక్కువ తీవ్రత ఉన్న నేరంగా పరిగణిస్తారు. గరిష్ఠంగా నాలుగేళ్ల వరకు జైలు శిక్ష ఉండగా, దీనిపై పూర్తి విచక్షణాధికారం న్యూయమూర్తిదే. కచ్చితంగా జైలు శిక్ష విధిస్తారని కూడా చెప్పలేమని అక్కడి న్యాయ నిపుణులు అంటున్నారు. అధ్యక్ష ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో వాటన్నింటినీ పరిగణనలోకి తీసుకునే అవకాశం ఉందని భావిస్తున్నారు. ఒకవేళ జైలు శిక్ష కాకపోతే జరిమానా కూడా విధించే అవకాశాలు ఉన్నాయని చెప్పారు. కోర్టు శిక్ష ఖరారు చేసిన తర్వాత తనను దోషిగా తేలుస్తూ ఇచ్చిన తీర్పుపై ట్రంప్‌ పై కోర్టులో అప్పీలు చేసుకోవచ్చు. అందుకోసం ఆయన న్యాయవాదుల బృందం ఇప్పటికే పనులు ప్రారంభించింది.

ఎన్నికల్లో పోటీ చేస్తారా?
తాజా కోర్టు తీర్పుతో ట్రంప్‌ అధ్యక్ష అభ్యర్థిత్వంపై ఎలాంటి ప్రభావం ఉండదని న్యాయనిపుణులు అభిప్రాయపడ్డారు. నేరారోపణలు రుజువైతే ఎన్నికల్లో పోటీ నుంచి వైదొలగాలనే నిబంధనేమీ లేదని వెల్లడించారు. 1920లో ఓ సోషలిస్ట్‌ నేత జైలులో ఉండే అధ్యక్ష ఎన్నికల్లో పోటీచేశారని గుర్తుచేశారు. ప్రచారం యథావిధిగా కొనసాగించొచ్చని వివరించారు. దోషిగా తేలి గృహ నిర్బంధానికి పరిమితమైతే ట్రంప్‌ వర్చువల్‌గా ప్రచారం చేపడతారని ఆయన కోడలు, రిపబ్లికన్‌ నేషనల్‌ కమిటీ కో-ఛైర్‌ లారా ట్రంప్‌ ప్రకటించారు.

తాజా తీర్పుతో రిపబ్లికన్‌ వర్గాలను మరింత ఐక్యం చేస్తాయని అక్కడి ప్రముఖ రాజకీయ వ్యూహకర్తలు అంచనా వేస్తున్నారు. ట్రంప్‌నకు మద్దతుగా పెద్ద ఎత్తున విరాళాలు వెల్లువెత్తే అవకాశం ఉందంటున్నారు. ఆయన దోషిగా తేలితే పరిస్థితేంటని ఇటీవల ఓ ప్రముఖ ఛానెల్‌ పోల్‌ నిర్వహించింది. కేవలం 4 శాతం మంది మాత్రమే మద్దతును ఉపసంహరించుకుంటామని తెలిపారు. మరో 16 మంది ఆలోచిస్తామని వెల్లడించడం గమనార్హం.

Last Updated : May 31, 2024, 8:43 AM IST

ABOUT THE AUTHOR

...view details