India Strong Reply To Pakistan In UN : ఐక్యరాజ్యసమితి వేదికగా భారత్‌పై మరోసారి పాకిస్థాన్ అక్కసు వెళ్లగక్కింది. జమ్ముకశ్మీర్ అంశాన్ని లేవనెత్తింది. దీంతో దాయాది దేశానికి భారత్ కూడా గట్టిగా బదులిచ్చింది. జమ్ముకశ్మీర్ ఎప్పటికీ భారత్‌లోని అంతర్భాగమేనని రాజ్యసభ ఎంపీ, బీజేపీ అధికార ప్రతినిధి సుధాంశు త్రివేది ఘాటుగా బదులిచ్చారు. ఐక్యరాజ్య సమితి శాంతిపరిరక్షణ చర్యలపై చర్చ సందర్భంగా పాక్ చేసిన అసత్య ప్రచారాన్ని ఆయన తిప్పికొట్టారు.
"మనం సమావేశమైన ఉద్దేశాన్ని పక్కదారి పట్టించేలా వ్యవహరించిన పాకిస్థాన్‌కు సమాధానం చెప్పే హక్కు భారత్‌కు ఉంది. జమ్ముకశ్మీర్ ఇప్పుడూ, ఎప్పుడూ భారత్‌లో అంతర్భాగమే. ఇటీవల జమ్ముకశ్మీర్ ప్రజలు తమ ఓటుహక్కును వినియోగించుకొని కొత్త ప్రభుత్వాన్ని ఎన్నుకున్నారు. పాక్ తన అసత్య ప్రచారాన్ని ఇకనైనా మానుకోవాలి. పాకిస్థాన్ వాస్తవాలను మార్చలేదు. ఐక్యరాజ్యసమితి విధానాలను దుర్వినియోగం చేయడానికి పాకిస్థాన్ ప్రయత్నిస్తోంది." అని రాజ్యసభ ఎంపీ సుధాంశు త్రివేది వ్యాఖ్యానించారు.
'పాక్ పక్కదారి పట్టిస్తోంది'
పాకిస్థాన్‌లోని ఐక్యరాజ్యసమితి మిలిటరీ అబ్జర్వర్ గ్రూప్ గురించి ఆ దేశ ప్రతినిధి మాట్లాడగా త్రివేది ధీటుగా బదులిచ్చారు. ఐక్యరాజ్య సమితి శాంతిపరిరక్షణ చర్యలపై మాట్లాడకుండా పాక్ విషయాన్ని పక్కదారి పట్టిస్తోందని ఆరోపించారు. జమ్ముకశ్మీర్‌పై పాక్ చేస్తున్న ఆరోపణలు నిరాధారమైనవని పేర్కొన్నారు. అలాగే తప్పుదోవపట్టించేవని తెలిపారు. అంతర్జాతీయ వేదికపై నరేంద్ర మోదీ నేతృత్వంలోని భారత్ బలమైన విదేశీ విధానాలను పాటిస్తుందని వెల్లడించారు.
"ఐక్యరాజ్యసమితి శాంతి పరిరక్షణకు సహకరించడంలో భారత్ ముందుంటుంది. శాంతి పరిరక్షకులకు వ్యతిరేకంగా నేరాలకు పాల్పడినవారికి శిక్ష పడాలి. ఇలాంటి చర్యల్లో జవాబుదారీతనం అవసరం. యూఎన్ శాంతి పరిరక్షణ అనేది ఒక ఆపరేషన్ మాత్రమే కాదు. ఇది అత్యంత అంకితభావంతో కూడిన లక్ష్యం." అని సుధాంశు త్రివేది తెలిపారు.
పాక్ ప్రధానికి గట్టి కౌంటర్
ఈ ఏడాది సెప్టెంబరులో ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ సెషన్లో సాధారణ చర్చ సందర్భంగా పాకిస్థాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ జుమ్ముకశ్మీర్ అంశాన్ని లేవనెత్తారు. ఆర్టికల్ 370 రద్దు గురించి కూడా మాట్లాడారు. దాదాపు 20 నిమిషాల పాటు చేసిన ప్రసంగంలో తమ దేశంలోని సమస్యలను వదిలేసిన షరీఫ్, కేవలం కశ్మీర్ గురించే సుదీర్ఘంగా ప్రస్తావించారు. పాలస్తీనా మాదిరిగానే జమ్ముకశ్మీర్ ప్రజలు కూడా స్వేచ్ఛ, నిర్ణయాధికారం కోసం పోరాడుతున్నట్లు వ్యాఖ్యానించారు. ఐరాస భద్రతా తీర్మానాలకు అనుగుణంగా కశ్మీర్ సమస్యపై శాంతియుత పరిష్కారం కోసం చర్చలు జరపాలన్నారు. దీంతో భారత దౌత్యవేత్త భవిక మంగళానందన్ పాకిస్థాన్‌కు గట్టి కౌంటర్ ఇచ్చారు. మళ్లీ పాకిస్థాన్ మరోసారి ఐరాస వేదికగా జమ్ముకశ్మీర్ అంశాన్ని ప్రస్తావించడం గమనార్హం.