US Elections 2024 Trump : అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో కీలకమైన స్వింగ్ రాష్ట్రం నెవడాలో రిపబ్లికన్ పార్టీ అధ్యక్ష అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ గెలుపొందారు. ఈ విజయంతో నెవడాలోని ఆరు ఎలక్టోరల్ ఓటర్లు ట్రంప్ ఖాతాలోకి చేరాయి. దీంతో ట్రంప్ ఎలక్టోరల్ స్థానాల సంఖ్య 301కి పెరిగింది. 2004 తర్వాత తొలిసారి నెవడాలో ఆరు ఎలక్టోరల్ ఓట్లను రిపబ్లికన్ పార్టీ గెలుచుకుంది.
అప్పుడు అమెరికా మాజీ అధ్యక్షుడు జార్జ్ W బుష్ ఆ పార్టీ తరఫున ఆరు ఓట్లను గెలుచుకున్నారు. అమెరికాలో మొత్తం 538 ఎలక్టోరల్ ఓట్లు ఉండగా అధికారపగ్గాలు చేపట్టడానికి 270 అవసరం. ఇప్పటికే ట్రంప్ ఖాతాలో 301 ఎలక్టోరల్ ఓట్లు చేరాయి. డెమోక్రటిక్ అభ్యర్థి కమలా హారిస్‌కు 226 వచ్చాయి. ఆరిజోనాలో కూడా ట్రంప్ ఆధిక్యంలో ఉన్నందున ఆ ఫలితాలు కూడా వస్తే ట్రంప్ ఎలక్టోరల్ స్థానాల సంఖ్య 312కు పెరగనుంది.
భారీ ఊరట
మరోవైపు, అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టేందుకు సిద్ధమవుతున్న ట్రంప్‌నకు భారీ ఊరట లభించింది. 2020 నాటి ఎన్నికల అనంతరం చెలరేగిన హింసకు సంబంధించి ఆయనపై ఉన్న కేసుల దర్యాప్తును న్యాయమూర్తి నిలిపివేశారు. ఆ కేసు విచారణకు సంబంధించిన పెండింగ్ డెడ్‌లైన్స్‌ను పక్కనబెట్టాలని స్పెషల్ కౌన్సిల్ జాక్ స్మిత్ కోరగా అందుకు న్యాయమూర్తి అంగీకారం తెలిపారు.
అమెరికాలో న్యాయశాఖ నిబంధనల ప్రకారం, సిట్టింగ్ అధ్యక్షుడు క్రిమినల్ విచారణను ఎదుర్కోకుండా వారికి రక్షణ ఉంటుంది. ప్రస్తుత ఎన్నికల్లో ట్రంప్ విజయం సాధించడంతో మరికొద్ది రోజుల్లో ఆయన అధ్యక్ష బాధ్యతలు చేపట్టనున్నారు. దీంతో ఆయనపై గతంలో నమోదైన 2020 నాటి ఎన్నికల కేసులో ఎలా ముందుకు వెళ్లాలన్న దానిపై స్పెషల్ కౌన్సిల్ తర్జనభర్జన పడుతోంది. ఈ క్రమంలోనే దీనిపై నిర్ణయం తీసుకునేందుకు గడువు కల్పించాలని న్యాయమూర్తి అభ్యర్థించింది. అప్పటివరకు కేసు విచారణ డెడ్‌లైన్‌లను పక్కనబెట్టాలని కోరింది. ఇందుకు యూఎస్ డిస్ట్రిక్ట్ జడ్జి తాన్య చుట్కన్ అంగీకరించారు. కేసు విచారణను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు ప్రకటించారు.
2020 నాటి ఎన్నికల్లో బైడెన్ విజయం సాధించిన అనంతరం హింసాత్మక ఘటనలు చెలరేగాయి. వాటిని ట్రంప్ ప్రేరేపించారన్న ఆరోపణలతో ఆయనపై అభియోగాలు నమోదయ్యాయి. దీంతో పాటు ఆయన మరిన్ని కేసులు ఎదుర్కొంటున్నారు. పోర్న్ స్టార్‌కు హష్ మనీ కేసులో ట్రంప్ దోషిగా తేలగా, ఈ కేసుకు సంబంధించి న్యూయార్క్‌లోని న్యాయస్థానం నవంబర్ 26న శిక్ష ఖరారు చేయాల్సి ఉంది.