Israelis Mass Protests :ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహుకు వ్యతిరేకంగా సోమవారం నిరసనకారులు భారీ ప్రదర్శనలు చేశారు. కాల్పుల విరమణకు అంగీకరించాలని, హమాస్ చెరలోని బందీలను సురక్షితంగా రప్పించాలని డిమాండ్ చేస్తూ టెల్ అవీవ్ వీధుల్లో ఆందోళన చేపట్టారు. హమాస్ చెరలోని ఆరుగురు బందీల మృతదేహాలు రఫాలోని ఓ సొరంగంలో లభ్యమైన నేపథ్యంలో నెతన్యాహు ప్రభుత్వంపై ఇజ్రాయెల్ ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దేశంలోని అతి పెద్ద కార్మిక సంఘమైన హిస్టాడ్రుట్ ఒక రోజు సార్వత్రిక సమ్మెకు పిలుపు ఇచ్చింది. దీనికి జనం నుంచి భారీ స్పందన వచ్చింది. ఇందులో వైద్యులు, బ్యాంకు ఉద్యోగులు, ప్రభుత్వ సిబ్బందితో పాటు విపక్ష నేతలు కూడా పాల్గొన్నారు. అయితే ఈ సమ్మె రాజకీయ ప్రేరేపితమైంది అంటూ ప్రభుత్వం లేబర్ కోర్టును ఆశ్రయించింది. మధ్యాహ్నం 2.30 గంటలకల్లా సమ్మె విరమించాలని కార్మిక సంఘాన్ని కోర్టు ఆదేశించింది. దీనితో ఈ ఉత్తర్వులను పాటిస్తామని హిస్టాడ్రుట్ తెలిపింది.
నెతన్యాహుపై భగ్గుమన్న ఇజ్రాయెల్ - సార్వత్రిక సమ్మెలో నిరసనకారుల భారీ ప్రదర్శనలు - Israelis Mass Protests
Israelis Mass Protests : సోమవారం ఇజ్రాయెల్ ప్రజలు ప్రధాని నెతన్యాహుకు వ్యతిరేక భారీ ప్రదర్శనలు చేశారు. కాల్పుల విరమణ ఒప్పందానికి అంగీకరించాలని, హమాస్ చెరలోని బందీలను సురక్షితంగా రప్పించాలని డిమాండ్ చేశారు. అయితే ఈ నిరసనలపై నెతన్యాహు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. నిరసనకారుల ప్రదర్శనలు పరోక్షంగా హమాస్‌కు మద్దతిస్తున్నట్లుగా ఉన్నాయని వ్యాఖ్యానించారు.
Published : Sep 3, 2024, 7:13 AM IST
సిగ్గుచేటు
తమ ప్రభుత్వానికి వ్యతిరేకంగా సమ్మె చేయడంపై ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది పరోక్షంగా హమాస్‌కు మద్దతివ్వడమే అవుతుందన్నారు. "ఇది సిగ్గుచేటైన విషయం. సిన్వర్ (హమాస్ అగ్రనేత) నువ్వు ఆరుగురిని హత్య చేశావు. అందుకు మేము నీకు మద్దతిస్తున్నాం" అని ప్రజలు సమ్మె చేసినట్లు ఉందని ఆయన వ్యాఖ్యానించారు. గాజా-ఈజిప్టు సరిహద్దు నుంచి సైన్యాన్ని ఉపసంహరించేది లేదని నెతన్యాహు తేల్చి చెప్పారు. మరోవైపు హమాస్ చెరలో మృతి చెందిన ఇజ్రాయెల్-అమెరికా పౌరుడు హెర్స్ గోల్డ్‌బెర్గ్ పోలిన్ అంత్యక్రియలు జెరూసలెంలో నిర్వహించారు. ఈ అంతిమ యాత్రలో భారీ సంఖ్యలో జనం పాల్గొన్నారు.
తప్పు నెతన్యాహుదే!
కాల్పుల విరమణ ఒప్పందం కుదరకపోవడానికి ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహుయే కారణమన్న రీతిలో అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ వ్యాఖ్యలు చేశారు. సోమవారం విలేకరులతో మాట్లాడిన బైడెన్, కాల్పుల విరమణ ఒప్పందానికి చాలా దగ్గరలో ఉన్నామని చెప్పారు. ఈ సందర్భంగా విలేకరులు, చర్చలు ఫలప్రదం కావడానికి తగిన ప్రయత్నాలను నెతన్యాహు చేయడం లేదా? అని ప్రశ్నించారు. దీనికి బైడెన్ 'అవును' అని సమాధానమిచ్చారు. మరోవైపు ఇజ్రాయెల్‌కు ఆయుధాలను సరఫరా చేసే విషయంలో బ్రిటన్ కీలక ప్రకటన చేసింది. టెల్ అవీవ్‌కు కొన్ని రకాల ఆయుధాల సరఫరాను నిలిపివేస్తున్నట్లు తెలిపింది. అంతర్జాతీయ చట్టాలను ఉల్లంఘించి ఆ ఆయుధాలను వినియోగించే అవకాశం ఉందని, అందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది.